కుటుంబంలో కొడుకు, తండ్రి మరణం బాధాకరం
వేమూరు: విద్యుదాఘాతంతో కొడుకు మృతి చెందడంతో తండ్రి తట్టుకోలేక రైలు కింద పడి మృతి చెందిన కుటుంబాన్ని రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి పరామర్శించారు. మండల కేంద్రంలోని బేతాలు పురం గ్రామానికి చెందిన అట్లూరు సునీల్ విద్యుదాఘాతంలో శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీన్ని తట్టుకోలేని తండ్రి అట్లూరు వెంకయ్య సాయంత్రం రైలు కింద పడి మృతి చెందాడు. ఒకే కుటుంబంలో కొడుకు, తండ్రి మృతి చెందడంతో గ్రామ ప్రజలు, అధికారులు అందోళనకు గురయ్యారు. రెండు మృత దేహాలను పోస్టుమార్టం కోసం తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం గ్రామస్తులకు అప్పగించారు. రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి తెనాలి ప్రభుత్వ ఆసుత్రికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడి పోస్టుమార్టం త్వరగా చేయించారు. అనంతరం బేతాలు పురం గ్రామానికి వెళ్లి మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకే కుటుంబంలో కొడుకు, తండ్రి మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్‌కు పెళ్లి అయి సంవత్సరమే అయిందని, భార్య నిండు గర్భిణితో ఉందని ఆమె చెప్పారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం నిధులతో ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులు పొలాల్లో కరెంట్ లైన్ల మరమ్మతులపై అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు సుశీల, వీఆర్వోలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


