వక్ఫ్ బోర్డు భూములను ఇతర సంస్థలకు అప్పగించవద్దు
చీరాల: అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థలకు చెందిన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ హుమయుం కబీర్ అన్నారు. ఆదివారం స్థానిక రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థలకు చెందిన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుందన్నారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూముల్లో ముస్లిం మైనార్టీ వర్గాల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి తోడ్పడాలే తప్పా వేరే సంస్థలకు అప్ప చెప్పకూడదని అన్నారు. గుంటూరులో వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంఽధించిన 71.57 ఎకరాలను ఐటీ పార్కుకు ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అన్యాయమని తెలిపారు. గతంలో ఇచ్చిన ఆస్తులను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు ధారాదత్తం చేస్తే ఉద్యమిస్తామని చెప్పారు. ముస్లిం మైనార్టీ వర్గాల అభివృద్ధికి ఉపయోగించాలే గానీ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు షేక్ అల్లాబక్షు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, జిల్లా కార్యదర్శులు షేక్ సుభాని, షేక్ సలాం, వేటపాలెం మండల మైనార్టీ సెల్ ఇన్‌ఛార్జి షేక్ ఖాదర్, ఈపూరుపాలెం మండల సభ్యులు షేక్ నాగూర్, కొత్తపేట మైనార్టీ సెల్ సభ్యులు షేక్ అబ్దుల్లా, మాజీ కో–ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.


