సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
చీరాల టౌన్: తమ సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు దాఖలు చేసిన ప్రతి అర్జీదారుని సమస్యను పరిష్కరించి న్యాయం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు తెలిపారు. చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లోని ప్రజలు పెట్టుకున్న అర్జీలపై శనివారం ప్రత్యేక పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 19 అర్జీలు పూర్తిగా ఆధారాలు, రికార్డులతో విచారించి బాధితులకు న్యాయం చేశారు. మూడు అర్జీలకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణలు చేసి వాటికి కూడా పరిష్కారం చూపుతామని ఆర్డీఓ తెలిపారు. ఆర్డీఓ మాట్లాడుతూ చీరాల డివిజన్ పరిధిలో ఉన్న ప్రతి మండలంలో వచ్చిన భూ సమస్యలు, పీజీఆర్‌ఎస్ అర్జీలను క్షుణ్ణంగా విచారించి అర్జీదారునికి నిర్ణీత సమయంలో సమస్య పరిష్కరించేందుకు ప్రతి మండలంలో ఒకసారి ప్రత్యేక పరిష్కార వేదికను అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి అర్జీ విచారించి అర్జీదారులతో మాట్లాడడంతోపాటుగా ఆన్‌లైన్‌లో ప్రతి అర్జీదారుని వివరాలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు నివేదించి పరిష్కారం చేస్తున్నామన్నారు. రెవెన్యూ, ఇతర భూసమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించేందుకే ప్రత్యేక పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు కుర్రా గోపికృష్ణ, గీతారాణి, జె.ప్రభాకరరావు, డిప్యూటీ తహసీల్దార్లు, మండలాల సర్వేయర్లు, పంచాయతీల కార్యదర్శులు, వీఆర్వోలు, అర్జీదారులు పాల్గొన్నారు.
ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు


