న్యూఇయర్ వేడుకలకు అనుమతి తప్పనిసరి
● రిసార్ట్స్, రెస్టారెంట్లలో
పార్టీలకు అనుమతిలేదు
● అసాంఘిక, చట్ట వ్యతిరేక
కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు
● జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్లటౌన్: న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ రిసార్ట్స్, రెస్టారెంట్ల యజమానులకు సూచించారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని రిసార్ట్స్, రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 60 రిసార్ట్స్, రెస్టారెంట్లు ఉన్నాయని తెలిపారు. లిక్కర్ పార్టీలు నిర్వహించరాదని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లతో కూడిన బోర్డులు యాత్రికులకు కనిపించే విధంగా రిసెప్షన్ వద్ద, డైనింగ్ ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. మద్యం తాగి ఎవరు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మైనర్లు వచ్చి రిసార్ట్స్, రెస్టారెంట్లలో రూములు కోరితే వారికి ఇవ్వవద్దని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి సంక్రాంతి పండుగ ముగిసే వరకు, ఆ తర్వాత కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడానికి వీలు లేదన్నారు. రిసార్ట్స్, హోటళ్లు, రెస్టారెంట్ల పరిధిలోగానీ, వారు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తులు గానీ ఏవైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, చీరాల డీఎస్పీ ఎం.డి.మొయిన్, సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఎస్‌బీ సీఐ జి.నారాయణ, బాపట్ల రూరల్ స్టేషన్ సీఐ కె.శ్రీనివాసరావు, చీరాల రూరల్ సర్కిల్ సీఐ పి.శేషగిరి, బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న రిసార్ట్స్, హోటల్ యజమానులు, నిర్వాహకులు పాల్గొన్నారు.


