ధాన్యం రైతుకు తేమ కష్టాలు
మందకొడిగా కొనుగోళ్లు తేమ శాతంతో ఇబ్బందులు ధాన్యం ఆరబోతకు మంచు అడ్డంకులు ఇప్పటివరకు ప్రభుత్వం కొన్న ధాన్యం 75,839 మెట్రిక్ టన్నులు బస్తా ధాన్యం రూ.1450కి కొంటున్న దళారులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ధాన్యం రైతులకు తేమ శాతం కష్టాలు తప్పడం లేదు. వారం రోజులు ఆరబెట్టినా రైతు సేవా కేంద్రాల్లో తేమ శాతం 20కి తగ్గకుండా వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అదే ధాన్యాన్ని రైస్ మిల్లులకు తోలితే అక్కడ 25కి తగ్గకుండా ఉంటోంది. దీంతో ధాన్యంలో కోతలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పేరుకు మద్దతు ధరకు ధాన్యం అమ్ముతున్నా.. రైస్ మిల్లులవారు పాయింట్‌కు కిలోకు తగ్గకుండా ధాన్యం కోత పెడుతున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన తేమ శాతం 25 ఉంటే 8 కిలోల ధాన్యాన్ని మిల్లర్లు తగ్గించి కొంటున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి 75 కిలోల బస్తా ధాన్యం ఽమద్దతు ధర రూ.1792 ఉండగా కోత పెట్టిన ధాన్యానికి కిలోకు రూ.24 చొప్పున 17 శాతానికి పైన అదనంగా ఎన్ని కిలోలు తేమ శాతం ఉంటే అంత మొత్తం కోతపెడుతున్నారు. దీంతో పేరుకు మద్దతు ధరకు ధాన్యం అమ్మినా బస్తా ధాన్యానికి రూ.1500ల లోపే వస్తుందని రైతులు చెబుతున్నారు. తేమశాతం మిషన్లలో తేడాలున్నట్లు మొదటినుంచి ఆరోపణలున్నాయి. రైతుసేవాకేంద్రాల్లోని యంత్రాలకు మిల్లుల్లోని యంత్రాలమధ్య తేడాలు చూపిస్తుండడంతో ఆ ఆరోపణలకు బలం చూకూరుతోంది. రైతులనుంచి ధాన్యం కొట్టేసేందుకు మిల్లర్లు తేమశాతం యంత్రాల్లో తేడాలు చూపేలా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులు మిల్లర్లపై చర్యలు తీసుకొని దీనిని సరిదిద్దాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి.
ఇబ్బందికరంగా పొగమంచు
ఇటీవల కాలంలో పొగమంచు అధికంగా ఉండడంతో ధాన్యం ఆరబెట్టడం రైతులకు కొంత ఇబ్బందిగా మారింది. వారం రోజులపాటు ఆరబెట్టినా ధాన్యం సక్రమంగా ఆరడంలేదు. తేమశాతం అధికంగా చూపిస్తుండడంతో చాలామంది రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఇదే అవకాశంగా దళారులు బస్తా ధాన్యం రూ.1400 నుంచి రూ.1450కే కొనుగొలు చేస్తుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది.
మద్దతు ధర లభించే పరిస్థితి లేకపోవడంతో చాలామంది రైతులు ఈ సంవత్సరం కుప్పలు వేస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు, రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, చెరుకుపల్లె, బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాల్లో రైతులు అధికంగా కుప్పలు వేసుకుంటున్నారు. ధర పెరిగితే కుప్పలను నూర్పిడి చేసే అవకాశముంది.
సంక్రాంతి పండుగ నాటికి జిల్లాలో లక్ష టన్నుల ధాన్యం కొంటామని ధాన్యం సేకరణ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకూ 75,839 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా నగరం మండలంలో 11,390 టన్నులు, చెరుకుపల్లిలో 9,418, బాపట్లలో 7,115, కర్లపాలెంలో 6,614, కొల్లూరులో 6,504, అమృతలూరులో 5,983, మార్టూరులో 5,800, పిట్టలవానిపాలెం 4,943, నిజాంపట్నం లో 4,922, భట్టిప్రోలు 4,832, వేమూరు 4,790, రేపల్లెలో 4,259 టన్నుల చొప్పున ధాన్యం సేకరించారు. దాదాపు 22 మండలాల్లో 89,764 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు షెడ్యూల్ ఇవ్వగా శుక్రవారం నాటికి 75,839 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు రైతులకు రూ.172 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.166 కోట్లు ఇచ్చినట్లు డీఎం శ్రీలక్ష్మి తెలిపారు. జిల్లాలో 73 మిల్లుల పరిధిలో ధాన్యం సేకరణకు బ్యాంకు గ్యారంటీలు తీసుకొన్నామని, పండగ నాటికి మరో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నట్లు ఆమె చెప్పారు. మరోవైపు దాదాపు 30 రైస్ మిల్లుల నుంచి ప్రతిరోజూ 29 టన్నుల బియ్యం తీసుకుంటున్నామని, ఈ లెక్కన ధాన్యం నిల్వ ఉంచేందుకు రైస్ మిల్లుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవని డీఎం తెలిపారు. ఈ సీజన్‌లో ఖచ్చితంగా రైతుల నుంచి రెండు లక్షల టన్నుల ధాన్యం కొంటామన్నారు. తేమశాతం యంత్రాల్లో తేడా లేకుండా సరిదిద్దామని ఆమె తెలిపారు.
ధాన్యం రైతుకు తేమ కష్టాలు


