మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
బాపట్ల మాదక ద్రవ్యాల నియంత్రణకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, నియంత్రణపై జిల్లాస్థాయి కమిటీ సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి ఉత్పత్తుల నియంత్రణ, మహిళలపై నేరాల నియంత్రణలో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇటీవల రాజధానిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాపట్ల జిల్లా ఎస్పీని ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్పీని అభినందించారు. మూడో స్థానంలో రావడానికి అధికారులు కృషి చేయాలన్నారు. గుర్తించిన 71 ప్రాంతాలలో చిల్ల చెట్ల తొలగింపు, సీసీ కెమెరాల ఏర్పాటు, వినియోగంలో లేని భవనాలపై నిఘా ఉంచాలన్నారు. ఈగల్ టీం సమర్థంగా పనిచేస్తుందన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణపై పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
గంజాయి వినియోగించే ప్రాంతాలు గుర్తింపు
గంజాయి వంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై పటిష్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. గంజాయి వినియోగించే 71 ప్రాంతాలను పోలీసులు గుర్తించారన్నారు. ఈగల్ టీం సమర్థంగా పనిచేస్తుందన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు నియంత్రణపై చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. గంజాయి ఉత్పత్తులు పూర్తిగా అరికట్టామన్నారు. ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి దిగుమతిని అరికట్టామన్నారు. ఆ రాష్ట్రం నుంచి పనులపై జిల్లాకు వచ్చిన కూలీలు ఉన్న ప్రాంతాలను గుర్తించి అవగాహన కల్పించాలన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు, డీఎస్పీలు, కమిటీలోని ఆయా శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
జిల్లా అభివృద్ధి కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. ఎస్టీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పీజీఆర్‌ఎస్ కార్యక్రమం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీలు, దివ్యాంగుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. అక్కడికక్కడే వాటికి ఆయన పరిష్కార మార్గం చూపారు. దివ్యాంగులు, ఎస్టీలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు తమ వంతు సహాయం అందించాలని అన్నారు. దివ్యాంగులు, ఎస్టీల హక్కులను గౌరవించాలన్నారు. మనం చేయగలిగినంత మేర సహాయం అందించాలన్నారు. బాపట్ల జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతున్నన్నప్పటికీ ఆయా శాఖలకు జిల్లా అధికారులు లేకపోవడం బాధాకరమని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డీఆర్వో జి.గంగాధర్‌గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రహదారి ప్రమాదాలను
పూర్తిస్థాయిలో అరికట్టాలి
రహదారుల ప్రమాదాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులు ఆదేశించారు. రహదారుల భద్రతపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. రహదారుల భద్రతా చర్యలు లేకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రమాదాలు తరచూ నమోదయ్యే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించి తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విరివిగా నిర్వహించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురైతే బాధిత కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో గుర్తించాలన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్


