విధులకు సచివాలయ ఉద్యోగులు డుమ్మా
చినగంజాం: ప్రభుత్వ సేవలను ప్రజలకు నేరుగా అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ కూటమి ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమవుతోంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది మండలంలోని పల్లెపాలెం గ్రామ సచివాలయం. పల్లెపాలెం గ్రామ సచివాలయం సిబ్బంది కొన్ని రోజులుగా స్థానిక ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కనీసం సమాధానం చెప్పేందుకు ఎవరూ ఉండటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది ఉదయం కార్యాలయానికి రావడం ముఖ హాజరు వేయడం, వారిష్టారీతిన బయటకు వెళ్లిపోవడం, సాయంత్రం వేళలో వచ్చి ముఖ హాజరు ముగించడం చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎం, విలేజ్ సర్వేయర్, వెల్‌ఫేర్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్, పంచాయతీ కార్యదర్శి, వెటర్నరీ లేక ఫిషరీస్ అసిస్టెంట్, గ్రామ రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండేలా గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థను ఏర్పాటు చేసి అందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పల్లెపాలెం గ్రామ సచివాలయంలో కార్యాలయానికి వెళ్లిన గ్రామస్తులకు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కనీసం ఒక ఉద్యోగి అయినా ప్రజలకు అందుబాటులో లేకపోగా సజావుగా సమాధానం ఇచ్చే పరిస్థితి కరువైంది. గ్రామ ప్రజలు కొందరు ఫోన్ ద్వారా గ్రామ కార్యదర్శిని సంప్రదించగా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ జవాబు రావడంతో చేసేదేమి లేని పరిస్థితుల్లో ఎంపీడీఓ కె.ధనలక్ష్మిని కలసి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంపీడీఓ కె.ధనలక్ష్మిని సంప్రదించి వివరణ కోరగా పల్లెపాలెం సచివాలయంలో సిబ్బంది గత కొద్ది రోజులుగా అందుబాటులో ఉండటం లేదని పనుల కోసం వెళ్లి ఇదేమిటని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇచ్చే పరిస్థితి లేదని తనకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యాలయంలో అందుబాటులో లేని సిబ్బందికి మెమోలు జారీ చేయనున్నట్లు, ఇకముందు ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
విధులకు సచివాలయ ఉద్యోగులు డుమ్మా


