అనారోగ్యంతో పోలీస్ జాగిలం టైగర్ మృతి
బాపట్ల టౌన్: పోలీస్ శాఖలో విశేషసేవలు అందించిన జాగిలం టైగర్ మృతి చెందడం బాధాకరమని బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. మృతిచెందిన టైగర్‌కు శుక్రవారం పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు భద్రతా విభాగంలో 2017 సంవత్సరం నుంచి విశేష సేవలు అందించిన పోలీసు స్నిఫర్ జాగిలం ‘టైగర్’ అనారోగ్యంతో మృతి చెందింది. మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎస్పీ వెదుళ్లపల్లి గ్రామంలో డాగ్ కెన్నెల్ భవనంలో ఉంచిన ‘టైగర్’కు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖకు ‘టైగర్’ జాగిలం విశేష సేవలు అందించిందన్నారు. స్నిఫర్ విభాగంలో సుమారు మూడేళ్ల పాటు ఎనలేని సేవలు అందించి, అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమన్నారు. వీఐపీ, వీవీఐపీ బందోబస్తుల సమయంలో పేలుడు పదార్థాలను గుర్తించడంలో చురుగ్గా, సమర్థవంతంగా పనిచేసిందన్నారు. ‘టైగర్’ స్నిఫర్ జాతికి చెందిన మగ జాగిలం. మంగళగిరి ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌లో స్నిఫర్ విభాగంలో శిక్షణ పొందిందన్నారు. 2017 సంవత్సరం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహించగా, 2022లో జిల్లాల విభజన అనంత రం బాపట్ల జిల్లా పోలీస్ శాఖకు కేటాయించబడింది. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బాపనేశ్వర్ 2017 సంవత్సరం నుంచి జాగిలానికి హ్యాండ్లర్‌గా వ్యవహరించారన్నారు. టైగర్ అందించిన సేవలకుగాను ‘టైగర్’ జాగిలానికి రూ.25 వేల నగదు బహుమతి అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.విజయసారథి, అడ్మిన్ ఆర్‌ఐ షేక్ మౌలుద్దీన్, డాగ్ హ్యాండ్లర్లు పాల్గొన్నారు.
పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు
అనారోగ్యంతో పోలీస్ జాగిలం టైగర్ మృతి


