మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్‌గా పొన్నెకల్లు యువతి
తాడికొండ: రాజస్థాన్‌లో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు ఫరెవర్ స్టార్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫేవరేట్ మిస్ టీన్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీల్లో మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్‌గా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన పరిటాల దివ్య ఎంపికై ంది. మిస్ టీన్ ఇండియా ఎంపిక పోటీల ప్రక్రియ ఏడాది క్రితమే మొదలై ఆన్‌లైన్‌లో అండర్–18 విభాగంలో ఎంపిక కోసం కమిటీ దరఖాస్తులు ఆహ్వానించగా దేశవ్యాప్తంగా 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యంత ప్రతిభావంతులైన వారికి ఆడిషన్లు, గ్రూమింగ్, మూల్యాంకనాలు ఇలా వివిధ దశల్లో వడపోత అనంతరం 101 మందికి రాజస్థాన్‌లోని జైపూర్‌లో జాతీయస్థాయి వేదికపై పోటీలు నిర్వహించారు. పోటీలలో వివిధ అంశాలలో తన ప్రతిభ ప్రదర్శించిన పరిటాల దివ్య టైటిల్ హోల్డర్‌గా నిలిచి ఫేవరెట్ మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్‌గా నిలిచారు. ఆమెకు కిరీటంతో పాటు గుర్తింపు పతకం ఇచ్చి అభినందించారు. దివ్య తండ్రి నరేష్ చైన్నెలోని నిర్మాణంగంలో ఉన్నారు. తమ కుమార్తెకు ఇంత పెద్ద గుర్తింపు రావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.


