ప్రజల కోసం పోరాడే వారిపై పీడీ యాక్టా?
జె.పంగులూరు: నిరంతరం పేదల కోసం పోరాడే రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై పీడీ యాక్టు అమలు చేయడం అన్యాయమని, వెంటనే ఆ యాక్టును రద్దు చేసి, విడుదల చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పంగులూరులో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. సీపీఎం సీనియర్ నాయకుడు నాగబోయిన రంగరావు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రైతుల దగ్గర అక్రమంగా భూములు తీసుకోవడాన్ని అప్పలరాజు వ్యతిరేకించి పోరాడుతున్నారన్నారు. ఇది జీర్ణించుకోలేని ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్టు పెట్టి, అరెస్టు చేసి విశాఖపట్నం జైలులో పెట్టారన్నారు. ఈ గ్రామానికి దగ్గరలో అంతకుముందే హటోర్ కంపెనీ వల్ల అక్కడ భూమి, భూగర్భ జలాలు, గాలి విషపూరితమయ్యాయని, వాటి ఫలితంగా అక్కడ ప్రజలు క్యాన్సర్, పక్షవాతం, గుండెపోటు, వంటి వ్యాధులు వచ్చి అల్లాడిపోతున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ రైతులు, ప్రజలు బల్క్ డ్రగ్ పార్కు వద్దని పోరాటం చేస్తున్నారని, ఆ పోరాటంలో ప్రజలకు అండగా రైతు సంఘం నాయకత్వంలో అప్పలరాజు నిలిచాడని రంగారావు తెలిపారు. ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయబోమని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీ మరిచిపోయి ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మానవ అవయువాలు, మాదకద్రవ్యాలు అమ్మేవారు, గుండాలు, రైతులపై పెట్టే పీడీ యాక్టు ప్రజల కోసం పనిచేసే అప్పలరాజుపై పెట్టడం అన్యాయమన్నారు. రైతుల దగ్గర ఉన్న భూమిని లాక్కొని, వారిని బజార్లు పడేయాలని ప్రయత్నంలో ప్రభుత్వాలున్నాయని, దీన్ని ప్రతి ఒక్కరూ ఖడించాలన్నారు. సుమారు 27 వేల ఎకరాలు వాన్ పిక్ భూమి ఖాళీగా ఉన్న, రైతుల భూములను బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పేదవాళ్లకు భూములు పంచాలని గతంలో పోరాడే వారమని, ఇప్పుడు రైతుల భూములను తీసుకోవద్దంటూ పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. విశాఖపట్నంలో ఎకరా 99 పైసలకు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని, ఇందుకేనా ఈ ప్రభుత్వాన్ని గెలిపించిందని రంగారావు ప్రశ్నించారు. పేదలకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకం పేరు మార్చి నిధులు తగ్గించి పేదల నోటి దగ్గర కూడు తీస్తున్నారని, మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్లకు అప్పజెబుతున్నారని, పాఠశాలలను కూడా ప్రైవేటు వాళ్లకే అప్పచెబుతారని రంగారావు విమర్శించారు. గంజాయికి వ్యతిరేకంగా పనిచేసిన పెంచలయ్యను నడిరోడ్డుపైన నరికేస్తే ఈ ప్రభుత్వం ఏమి చేయలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమ నేతలను పీడీ యాక్టు పెట్టి అరెస్ట్ చేయటం అన్యాయమని, తక్షణమే ప్రభుత్వం ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి గుడిపాటి మల్లారెడ్డి, కౌలు రైతు సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు రాయిని వినోద్‌బాబు, అట్లూరి లాజర్ మాట్లాడారు. సమావేశంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పి.ఆదుం సాహెబ్, బాచిన శేషగిరి, రావూరి వెంకటేశ్వర్లు, బాచిన ఆంజనేయులు, అవల హనుమంతరావు, పాలపర్తి రవి, కీర్తిపాటి రామరావు, నూతలపాటి సుబ్బారావు, కొనతం భాస్కరరావు, సుధాకర్ పాల్గొన్నారు.
ఇంత దుర్మార్గ పాలన ఎక్కడా లేదు
అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్టు
వెంటనే రద్దు చేయాలి
అఖిల పక్ష సమావేశంలో నాయకుల డిమాండ్


