వృద్ధుడి నేత్రదానం | - | Sakshi
Sakshi News home page

వృద్ధుడి నేత్రదానం

Dec 27 2025 7:42 AM | Updated on Dec 27 2025 7:42 AM

వృద్ధ

వృద్ధుడి నేత్రదానం

రేపల్లె: మండలంలోని నల్లూరుపాలేనికి చెందిన సుఖవాసి సుబ్బారావు(87) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన నేత్రాలను దానం కుటుంబ సభ్యులు నాగాయలంకకు చెందిన సుదర్శి మానవతా సేవా సంస్థకు సమాచారం అందించారు. దీంతో సంస్థ ప్రతినిధులు విజయవాడ ఎల్‌వీ కంటి ఆసుపత్రి ప్రతినిధులు ఆధ్వర్యంలో మృతుడు సుబ్బారావు నేత్రాలను శుక్రవారం సేకరించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు రఘు శేఖర్‌ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇప్పటికి 253 మంది వద్ద నేత్రాలను సేకరించి ఇతరులకు నేత్రదానం చేయటం జరిగిందని చెప్పారు. నేత్రదానానికి అంగీకరించి సుబ్బారావు కుమార్తెలు సబ్బినేని ప్రమీలారాణి, సబ్బినేని వెంకటేశ్వరమ్మ, అల్లుడు సబ్బినేని సుబ్బారావులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆటో ఢీకొని యువకుడు దుర్మరణం

మేదరమెట్ల: ఓ వ్యక్తి తన తమ్ముడు వద్దకు వెళ్లి తిరిగి మోటారు బైక్‌పై వెళుతుండగా ఆటో ఢీకొని దుర్మరణం పాలైన సంఘటన కొరిశపాడు మండల పరిధిలోని రావినూతల–దైవాలరావూరు రోడ్డులో గురువారం రాత్రి జరిగింది. కొరిశపాడు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. బల్లికురవ మండలం చినమల్లాయపాలెం గ్రామానికి చెందిన తంగిరాల వంశీ (24) మోటారు బైక్‌పై కొరిశపాడు మండలంలోని కనగాలవారిపాలెంలో తమ్ముడును కలిసి తిరిగి వస్తుండగా బైక్‌.. రావినూతల శివారులో ఉన్న పెట్రోల్‌ బంక్‌ సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న ఆటో బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో వంశీ తలకి, మెడకు, కాలికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

లారీ ఢీకొని టైల్స్‌ వర్కర్‌ మృతి

రొంపిచర్ల: మండలంలోని విప్పర్ల గ్రామ సమీపంలో శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఎక్స్‌్‌ప్రెస్‌ హైవేపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన హుస్సేన్‌(40) మృతి చెందాడు. హుస్సేన్‌ విప్పర్ల గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ఓ పెట్రోల్‌ బంకులో టైల్స్‌ పనికి వచ్చాడు. రాత్రివేళ బంకు సమీపంలో ఉన్న హోటల్‌కి వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా రొంపిచర్ల వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. హుస్సేన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

నాగార్జునసాగర్‌: ఇటీవల భార్య మరణించగా మనస్తాపం చెందిన భర్త చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. మాచర్ల పట్టణానికి చెందిన నల్లమల వెంకటేశ్వర్లు(65) భార్య ఇటీవల మృతి చెందింది. మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు శుక్రవారం మాచర్ల సమీపంలోని కాలువలో దూకి చనిపోవడానికి ప్రయత్నించగా అక్కడే స్నానం చేస్తున్న అయ్యప్ప మాలధారులు కాపాడారు. అక్కడి నుంచి బయలుదేరిన వెంకటేశ్వర్లు హిల్‌ కాలనీ సమీపంలో చెట్టుకు లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాగర్‌ ఎస్‌ఐ ముత్తయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

నకరికల్లు: ఓ వివాహిత అనుమానాస్పద స్థితితో మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కుంకలగుంట గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లవి (23)కి బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం గ్రామానికి చెందిన బూదాటి జయపాల్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం ఉన్నారు. కొన్నిరోజులుగా భార్య ప్రవర్తన, వేరేవాళ్లతో ఫోన్‌ మాట్లాడుతోందనే విషయమై దంపతులు గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన పల్లవిని భర్త పుట్టింట్లో వదలిపెట్టి వెళ్లాడు. మనస్తాపానికి గురైన పల్లవి గురువారం ఊపిరి బిగబట్టి స్పృహ కోల్పోగా.. నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కె.సతీష్‌ శుక్రవారం తెలిపారు.

మోసగించిన స్వర్ణకారుడిపై కేసు

యడ్లపాడు: ఆభరణాలు చేయించి ఇస్తానని స్వర్ణకారుడు పలువుర్ని నమ్మించి రూ.కోట్లలో వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన గత మూడు రోజులుగా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. సదరు కేసుకు సంబంధించి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. యడ్లపాడు గ్రామానికి చెందిన ఇళ్ళ ఊర్మిళ తాను రూ.3 లక్షల నగదును బంగారం ఆభరణా లకోసం అదే గ్రామానికి చెందిన ఏలూరి కామేశ్వరరావుకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కామేశ్వరరావు తనతోపాటు మండల వ్యాప్తంగా పలువురు మోసపోయినట్లు ఆరోపించారు. నిందితుడు పలువుర్ని మోసం చేసినట్లు తెలిపిందని ఎస్‌ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వృద్ధుడి నేత్రదానం  1
1/2

వృద్ధుడి నేత్రదానం

వృద్ధుడి నేత్రదానం  2
2/2

వృద్ధుడి నేత్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement