మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా
బొల్లాపల్లి: పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం సీతారాంపురం తండాలో డీఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 100 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. నరసరావుపేట ఇన్‌చార్జి డీఎస్పీ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ తండాలో గంజాయి వాడకం నివారించేందుకు విస్తృత తనిఖీలు చేపట్టామని తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం మాదకద్రవ్యాల నివారణకు ఉన్నతాధికారి స్థాయితో నిఘా ఏర్పాటు చేసిందని, తండావాసులు గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చాక్లెట్లు, సిగరెట్లు ద్వారా గంజాయి సరఫరా జరుగుతోందనే సమాచారం ఉందన్నారు. సమీప అటవీ ప్రాంతంలో గంజాయి మొక్కలు కనిపించినా ఈగల్ టీంకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తండాల్లో చోరీలకు పాల్పడే వారికి ఆశ్రయం కల్పిస్తున్నారని సమాచారం ఉందని తెలిపారు. నేరాలకు పాల్పడిన, అలాంటి వారికి ఆశ్రయం కల్పించినా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. కార్డెన్ సెర్చ్‌లో రికార్డులు లేని 32 ద్విచక్ర వాహనాలు, కారు, వైండింగు వైరు 4 చుట్టలు, గొడ్డళ్లు 4, కత్తులు 3, కొడవళ్లు సీజ్ చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో వినుకొండ రూరల్ సీఐ బి.బ్రహ్మయ్య, బండ్లమోటు ఎస్‌ఐ సయ్యద్ సమీర్ బాషా పాల్గొన్నారు.
సీతారాంపురం తండాలో కార్డెన్ సెర్చ్


