పేదలకు రుణాలు అందేనా!
సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలపై సమీక్ష ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల పనితీరుపైనా చర్చ రుణాల కోసం ఎదురు చూస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
బీసీలకు నిరాశే మిగిలింది
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశం
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కార్పొరేషన్ల పట్ల చిన్న చూపుచూపుతోంది. కొద్ది నెలల కిందట ఇదిగో రుణాలు ఇస్తున్నాం..వెంటనే దరఖాస్తు చేసుకోండి అని ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ప్రజలను నమ్మించి మాట మార్చింది. ఎస్సీ రుణాలకు యూనిట్లు మారుస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. బీసీ రుణాలకు సంబంధించి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్టీలకు కనీసం దరఖాస్తు చేసుకోమని చెప్పిన పాపన పోలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బుధవారం జెడ్పీ స్టాయీ సంఘ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలపై సమీక్షించనున్నారు. ఆయా వర్గాల ప్రజలు ప్రభుత్వ అసమర్థ పాలనపై గుర్రుగా ఉన్నారు.
ఎస్సీల ఆశలకు తెర
జిల్లా షెడ్యూల్డు కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో గుంటూరు జిల్లాకు రూ.990 యూనిట్లు కింద రూ.41.33 కోట్లు, పల్నాడు జిల్లాకు రూ.992 యూనిట్లు కింద రూ.38.56 కోట్లు మేర సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు ఏప్రిల్ నెల మొదటి వారంలో ప్రకటించారు. రూ.3 లక్షల నుంచి రూ.10లక్షల వరకు(40 నుంచి 60శాతం వరకు సబ్సిడీ) రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో నిరుద్యోగులు తమకు అనుభవం ఉన్న రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు సమ యం ఉన్నా యూనిట్లను మారుస్తున్నామంటూ సైట్‌ను ప్రభుత్వం మూసివేసింది. దీంతో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
సంక్షేమ హాస్టల్స్‌పై శీతకన్ను
గుంటూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లలపై ప్రభుత్వం శీతకన్ను చూపుతుంది. ఎస్టీ హాస్టల్‌లో భోజనం సరిగా లేకపోవడంతో, హాస్టల్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై ఎస్టీ నాయకులు మండిపడుతున్నారు. నెల రోజుల కిందట పెదనందిపాడు, అనపర్రు బీసీ హాస్టల్‌లో పుడ్ పాయిజన్ అయి 56 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో హాస్టల్స్‌లో విద్యార్థులు ఉండాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బాలికల హాస్టల్స్‌పై నియంత్రణ లేకుండా పోయింది.
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందిస్తున్నట్లు ప్రచారాన్ని హోరెత్తించారు. అదే స్థాయిలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రచారం చేశారు. జిల్లాలోని బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వారు వేలల్లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎంపికలు(క్రెడిట్ క్యాంపులు) జరిగాయి. తీరా రుణాలు అందుతాయనే సమయంలో సైట్ క్లోజ్ చేసి రుణాలకు సంబంధించిన ప్రక్రియను నిలుపుదల చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండలాలు, మున్సిపాలిటీల నుంచి కూడా ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపరాదని తేల్చేశారు. దీంతో బీసీ రుణాల కోసం ఆశించిన పేద వర్గాలకు నిరాశే మిగిలింది.


