రైతులు పొలం బడిని సద్వినియోగం చేసుకోవాలి
చెరుకుపల్లి: రైతులు పంటలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పొలం బడి కార్యక్రమం దోహదపడుతుందని జిల్లా వ్యవసాయ అధికారిణి కె.అన్నపూర్ణ అన్నారు. మండలంలోని రాజవోలు గ్రామంలో పొలం బడి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అన్నపూర్ణ రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి మండలంలోని వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ప్రతి రైతు ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి సందేశంతోపాటు ప్రభుత్వ పంచ సూత్రాలైన నీటి భద్రత, డిమాండు ఉన్న పంటల సాగు, వ్యవసాయంలో సాంకేతికత వాడుట, పండించిన పంటను ప్రాసెసింగ్ చేయుట, రైతులకు ప్రభుత్వం ద్వారా లభించే రాయితీలను వివరించాలని పేర్కొన్నారు. అనంతరం డీఏఏటీసీసీ కోఆర్డీనేటర్ (ఏరువాక) అచ్యతరాజు మాట్లాడుతూ రబీలో సాగు చేసుకోవాల్సిన అపసరాల గురించి వివరించారు. అనంతరం ఏడీఏ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎండీ ఫరూక్, వ్యవసాయ విస్తరణ అధికారి కె.ప్రియాంక, గ్రామ వ్యసాయ సహాయకులు లక్ష్మీదుర్గ, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారిణి అన్నపూర్ణ


