రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీల విజేతలుగా కడప, శ్రీకాకుళం
క్వార్టర్ ఫైనల్స్‌లోనే వెనుదిరిగిన ప్రకాశం బాల, బాలికల జట్లు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అండర్–19 బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీల ఫైనల్స్‌లో బాలుర విభాగంలో కడప జిల్లా, బాలికల విభాగంలో శ్రీకాకుళం జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. ఈ పోటీల్లో ప్రకాశం జిల్లా బాలబాలికల జట్లు రెండూ క్వార్టర్ ఫైనల్స్‌లోనే పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగాయి.
● మూడు రోజుల పాటు పోటీలు ఆద్యంతం హోరాహోరీగా జరిగాయి. చివరిరోజు సెమీ ఫైనల్స్‌లో బాలుర విభాగంలో కడప, చిత్తూరు, వైజాగ్, కర్నూలు జట్లు, బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జట్లు పోటీ పడ్డాయి.
● ఫైనల్స్‌కు బాలుర విభాగంలో కడప, చిత్తూరు జట్లు, బాలికల విభాగంలో శ్రీకాకుళం, గుంటూరు జట్లు చేరుకున్నాయి. ఫైనల్ పోటీలో బాలుర విభాగంలో కడప, చిత్తూరు జట్ల మధ్య జరిగిన పోటీలో చిత్తూరు జట్టు గట్టి పోటీ ఇచ్చినా చివరికి కడప జట్టు విజేతగా నిలిచింది. కడప 8 పాయింట్లు, చిత్తూరు 5 పాయింట్లు సాధించాయి.
● మూడో స్థానానికి వైజాగ్, కర్నూలు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరగగా చివరికి వైజాగ్ 11 పాయింట్లతో మూడో స్థానంలో, కర్నూలు 9 పాయింట్లతో నాల్గవ స్థానంతో సరిపెట్టుకుంది.
● బాలికల విభాగంలో జరిగిన ఫైనల్ పోటీలో శ్రీకాకుళం, గుంటూరు జట్లు తలపడగా రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. 6 పాయింట్లతో శ్రీకాకుళం జట్టు విజేతగా నిలిచి మొదటి స్థానాన్ని కై వసం చేసుకోగా గుంటూరు జట్టు 4 పాయింట్లతో రన్నర్ గా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కృష్ణా జట్టు 7 పాయింట్లతో మూడవ స్థానంలో, వైజాగ్ జట్టు 5 పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచాయి.
● చివరి రోజు బాలబాలికల జట్ల విజేతలకు మెడల్స్, కప్పు అందజేశారు. పోటీలు స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయని అన్ని జట్లు మంచి ప్రతిభ కనబరిచాయని కాలేజి ప్రిన్సిపాల్ సౌజన్య ప్రశంసించారు. పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ కే శంకర్రావును ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
● అండర్–19 సెక్రటరీ చింపారెడ్డి, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ పీ విజయకుమార్, మలినేని పెరుమాళ్లు, దేవీ సీఫుడ్స్ కంపెనీ మేనేజర్ మూర్తి, లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ శేషగిరి, సెక్రటరీ షేక్ పటేల్, పీఈటీలు ఎస్డీ జంషీర్, ఎన్‌టీ ప్రసాద్, షేక్ నౌషాద్, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర హ్యాండ్ బాల్ పోటీల విజేతలుగా కడప, శ్రీకాకుళం


