ఏఎన్‌యూ పీజీ మొదటి సెమిస్టర్
పరీక్షల ఫీజు షెడ్యూలు ప్రకటన
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూ అధికారుల వింత ధోరణికి విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాలేదు. పీజీ కౌన్సెలింగ్‌లో రెండు విడతల్లో అడ్మిషన్లు నిర్వహించిన నిర్వాహకులు స్పాట్ అడ్మిషన్లపై ఇప్పటి వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. యూనివర్సిటీ అధికారులు స్పాట్ అడ్మిషన్ల వ్యవహారంపై ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ మంత్రి నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నారు. వర్సిటీలోని పలు విభాగాల్లో స్పాట్ అడ్మిషన్ల వల్ల సీట్లు భర్తీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అనివార్య కారణాల వల్ల సకాలంలో దరఖాస్తు చేసుకోలేని వారి కోసం ప్రతి ఏడాది స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. స్కాలర్‌షిప్ రాకపోయినా పర్వాలేదు, సంవత్సరం వృథా కాకూడదనే భావనతో విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ ద్వారా ఆయా కోర్సుల్లో చేరుతూ ఉంటారు. ఈ సారి స్పాట్ అడ్మిషన్ జరగకుండానే ఫీజుల షెడ్యూల్ ప్రకటించడం గందగోళానికి దారి తీసింది. వర్సిటీ అధికారుల నిర్ణయంతో తమకు ఏడాది కాలం వృథా అవుతుందని స్పాట్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న పలువురు విద్యార్థులు వాపోయారు. దీనిపై సీఈఓ ఆలపాటి శివప్రసాద్‌ను వివరణ కోరగా అడ్మిషన్లకు తనకు సంబంధం లేదని, అకడమిక్ క్యాలండర్ ప్రకారం మంగళవారం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
జాతీయ సైక్లింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపిక
నరసరావుపేట రూరల్: జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎనిమిది మంది విద్యార్థులు ఎంపికై నట్టు జొన్నలగడ్డ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి.మల్లికార్జునరావు తెలిపారు. 69వ రాష్ట్ర స్థాయి స్కూల్‌గేమ్స్ పోటీలు ఎన్‌టీఆర్ జిల్లా నున్నా జెడ్పీ హైస్కూల్ నిర్వహించారు. జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి జాతీయ జట్టుకు ఎంపికయ్యారని హెచ్‌ఎం పేర్కొన్నారు. ట్రాక్ విభాగంలో సీహెచ్ విజయలక్ష్మి, ఎన్.పరమాత్మలు ప్రథమ స్థానం, రోడ్ విభాగంలో ఎస్‌కే నబీర్ (అండర్–17), వై.తేజస్విని (అండర్–14), ఎన్.సింధు (అండర్–14)లు ప్రథమస్ధానం, ఎన్.బింధుశ్రీ (అండర్–17), జి.నరేంద్ర (అండర్–14), ఎస్‌కే ఆమన్ (అండర్–14) ద్వితీయ స్థానం, జి.మణికంఠ (అండర్–17), ఎ.లావణ్య (అండర్–14)లు తృతీయ స్థానాలు సాధించినట్టు పేర్కొన్నారు.


