అమరావతి జిల్లా ఏమైంది?
డాక్టర్ జాస్తి వీరాంజనేయులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పడి పదకొండేళ్లు దాటినా జిల్లా ఏర్పాటు చేయకపోగా కనీసం అమరావతిలో రెవెన్యూ డివిజన్ కూడా లేదని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రజలు తమ అవసరాలకు గుంటూరుకు, అమరావతి టెంపుల్ సిటీ వారు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసరావుపేటకు వెళ్లాల్సి వస్తోందన్నారు. కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న దృష్ట్యా అమరావతిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ఈ ప్రాంత ప్రజలు చిరకాల కోరిక అని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, మంత్రుల కమిటీకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అమరావతిని కొత్త జిల్లా కేంద్రంగా, రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇకనైనా వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
పాముకాటుకు రైతు మృతి
నాదెండ్ల: పాముకాటుకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. వివరాలు.. మండలంలోని కనపర్రు గ్రామానికి చెందిన రైతు నరిశెట్టి చిన్నయ్య (55) సోమవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
మాచర్ల రూరల్: మండల పరిధిలోని కంభంపాడు గ్రామ సమీపంలోని సాగర్ కుడి కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు మాచర్ల రూరల్ ఎస్‌ఐ సంధ్యారాణి తెలిపారు. వయస్సు సుమారు 50 – 55 ఏళ్లు ఉంటుందన్నారు. ఒంటిపై ఆకుపచ్చ జాకెట్, నీలి రంగు చీర ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బాలుడి మృతదేహం..
తాడేపల్లిరూరల్: విజయవాడ కృష్ణానది నీటిలో సీతమ్మవారి పాదాల వద్ద కృష్ణలంక పోలీసులు మంగళవారం గుర్తు తెలియని ఓ బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం సీతానగరం నుంచి విజయవాడ వైపు వచ్చి ఉండవచ్చని భావించి తాడేపల్లి చుట్టు పక్కల ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. బాలుడి వయస్సు సుమారు 14 సంవత్సరాలు ఉండవచ్చని గుర్తించిన వారు తాడేపల్లి, కృష్ణలంక పోలీసుస్టేషన్‌లకు సమాచారం ఇవ్వాలని విజయవాడ పోలీసులు కోరారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
తెనాలి రూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొలకలూరు రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుమారు 50 ఏళ్ల వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తెనాలి వైద్యశాలకు తరలించారు.
డివైడర్‌ను ఢీకొట్టిన కళాశాల బస్సు
తెనాలి రూరల్: ఇంజినీరింగ్ కళాశాల బస్సు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. చేబ్రోలు మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల బస్సు ప్రకాశం రోడ్డులో పెట్రోలు బంకు వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. విద్యార్థులు అద్దాలపై పడడంతో అవి పగిలి పలువురు గాయపడ్డారు.


