వ్యవసాయం అభివృద్ధి సాధించడానికి కృషి చేయాలి
భట్టిప్రోలు: ప్రతి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయాలని బాపట్ల జిల్లా వ్యవసాయ శాఖాధికారి అన్నపూర్ణ పేర్కొన్నారు. మండలం కోనేటిపురం, సూరేపల్లి గ్రామాలలో నేల ఆరోగ్యం, సారవంతమైన నేల పథకం, పొలం పిలుస్తోందిపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రైతులందరూ ప్రభుత్వ మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముకోవాలని కోరారు. ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించిన రైతన్న మీకోసం కార్యక్రమం గూర్చి మాట్లాడారు. ప్రతి రైతు ఇంటి దగ్గరకు తీసుకెళ్లాలని సూచించారు. రైతులకు సాంకేతిక నైపుణ్యం అందించే విధంగా రూపొందించిన యాప్‌ను తప్పని సరిగా రైతులందరూ ఉపయోగించుకునేలా వారికి వివరించి చెప్పాలని అన్నారు. సంప్రదాయ వ్యవసాయానికి ఆధునికీకరణ జోడించి వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధించడానికి అవరమైన అన్ని రకాల పరిజ్ఞానం ఏపీ ఎయిమ్స్ యాప్‌లో ఉందని... అందరూ రైతులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. సైలెన్ వాటర్ స్కీమ్ శాస్త్రవేత్త మధువాణి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన నేల ఆవశ్యకతను తెలియజేశారు. నేల సారవంతం చేయడానికి ఆర్గానిక్ ఎరువుల వాడకంతో పాటుగా అందరూ తప్పని సరిగా పచ్చిరొట్ట ఎరువులు సాగుచేసుకోవాలని కోరారు. ప్రతి రైతు ఏడాది మట్టి, నీటి పరీక్షలు చేయించుకుని సదరు రిపోర్టుకు అనుగుణంగా ఎరువుల వాడటం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. ఈ యాప్ పని తీరును మండలంలో రైతన్న మీకోసం కార్యక్రమం పురోగతి కార్యక్రమానికి పర్యటించారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ అచ్చుతరాజు, రేపల్లె ఏడీ లక్ష్మి, మండల వ్యవసాయ శాఖాధికారి బి.బ్రహ్మరెడ్డి పాల్గొన్నారు.


