జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
మార్టూరు: స్థానికజాతీయ రహదారిపై జొన్నతాళి వద్ద మంగళవారం ఉదయం స్థానికులు చేపట్టిన నిరసనతో వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మార్టూరు కేంద్రంగా గ్రానైట్ అక్రమ రవాణా వ్యాపారం గతంలో జోరుగా సాగిన సంగతి తెలిసిందే. ఈ దందా ఆపడం కోసమంటూ ప్రభుత్వం ఏఎంఆర్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించింది. అందులో భాగంగా ఏఎంఆర్ సంస్థ జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లతో పాటు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే మార్గాలలో సైతం తమ సిబ్బందిని నియమించుకొని వసూలు చేసుకుంటున్నారు. అయితే గతంలో మార్టూరు కేంద్రం నుంచి గ్రానైట్ శ్లాబులు మాత్రమే ఎటువంటి బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలి వెళ్లేవి. అయితే వసూళ్ల బాధ్యతను ఏఎంఆర్ సంస్థ చేపట్టాక గ్రానైట్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విషయం ఏమో కానీ స్థానికంగా ఇతర సమస్యలు పెరిగాయి. ఈ కారణంగా గ్రానైట్ వ్యాపారులతో పాటు ఆ పరిశ్రమపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి దుర్భరంగా మారింది. అందువలన గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యంతో పాటు వాటిపై ఆధారపడి జీవించే వారు తరచూ ఏఎంఆర్ సంస్థ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో గ్రానైట్ పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు కొందరు సహనం నశించి మంగళవారం జొన్నతాళి సమీపంలో గ్రానైట్ పరిశ్రమ నుంచి డస్ట్ తరలించే ట్రాక్టర్లు విషయమై ఏంఆర్ సిబ్బందితో వివాదం ప్రారంభమైంది. ఇది పెరిగి పెద్దది కావటంతో స్థానికులు రహదారిపై వాహనాలను ఆపి తమ నిరసనను తెలియజేశారు. ఈ కారణంగా రహదారిపై వందలాదిగా వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు సుమారు అరగంట సేపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరుపక్షాలకు సర్దిచెప్పి పంపించడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.
వందలాదిగా నిలిచిపోయిన వాహనాలు


