మేలు జాతి పశువులతో అధిక ఆదాయం
కర్లపాలెం: రైతులు మేలుజాతి పశువులను పెంచుకోవటం వల్ల అధిక ఆదాయం పొందవచ్చునని బాపట్ల జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ చెప్పారు. కర్లపాలెం మండలంలోని యాజలి గ్రామంలో సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్, ఏపీ పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరం, లేగ దూడల అందాల పోటీలను నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని పశు సంవర్థక శాఖ జాయింట్ డైరక్టర్ టివి.సుధాకర్, యాజలి గ్రామ సర్పంచ్ నాదెండ్ల భానుప్రసాద్‌లు రిబ్బను కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ డైరక్టర్ సుధాకర్ మాట్లాడుతూ రైతులు మేలు జాతి పశువులను పెంచుకోవటంతో పాటుగా పోషక విలువలు ఉన్న దాణా అందించాలని చెప్పారు. పశువులలో వచ్చే వ్యాధులకు సకాలంలో వైద్యం చేయించాలన్నారు. ఈ వైద్య శిబిరంలో 115 పశువులకు గర్భకోశ వైద్య చికిత్సలు, 800ల పశువులకు సాధారణ వైద్య పరీక్షలు చేశారు. 200ల దూడలకు నట్టల నివారణ మందు వేశారు. అందాల పోటీలలో ఎంపికై న లేగ దూడల యజమానులకు బహుమతులతో పాటు మామిడి మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్యులు డాక్టర్ తహ అన్సారీ, రేచల్ దివ్య, తిరుమల తేజ, సాహిత్య, నాగార్జున, శివకుమారి, సత్యసాయి సేవా సమితి కర్లపాలెం మండల అధ్యక్షుడు తుమ్మల.శ్రీనివాసరావు, నా జన్మభూమి ప్రతినిధి గుండ్రెడ్డి సత్యనారాయణ, రామకృష్ణ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు మంతెన నాగరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్


