ప్రభుత్వ నిర్వాకంతో చేనేత పరిశ్రమ కుదేలు
30న రాష్ట్ర సదస్సు
చీరాల రూరల్: దేశ సంస్కృతీ, సంప్రదాయాలకు గతంలో నిలయంగా ఉన్న చేనేత పరిశ్రమ పవర్ లూమ్స్ రాకతో నేడు కుదేలైపోతోందని.. పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక గోలి సదాశివరావు కల్యాణ మండపంలో శుక్రవారం చేనేత నాయకుడు దామర్ల శ్రీకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈనెల 30న అక్కడే నిర్వహించనున్న రాష్ట్ర చేనేత సదస్సు కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆహ్వాన కమిటీ కన్వీనర్ బక్కా పరంజ్యోతి, అధ్యక్షుడు దామర్ల శ్రీకృష్ణ, గోశాల ఆశీర్వాదం, చుండూరి వాసు, దుడ్డు భాస్కరరావు, మేడా వెంకటరావు, ధరణికోట లక్ష్మీనారాయణ, ఇమంది పరమేశ్వరి మాట్లాడారు. చేనేత పరిశ్రమకు ఎంతో కృషి చేసిన దివంగత ప్రగడ కోటయ్య వర్ధంతి పురస్కరించుకుని రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అధిక ఉత్పత్తితో చవక ధరలతో వస్త్రాలను అందించగల బట్టల మిల్లులు వ్యాపారాన్ని ఆక్రమించాయని వివరించారు. ఆ తరువాత వచ్చిన పవర్ లూమ్స్ చేనేత పరిశ్రమను మరింత కోలుకోలేని దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నాణ్యత, మన్నికను బట్టి దేశ, అంతర్జాతీయ మార్కెట్లో చేనేత వస్త్రాల స్థానాన్ని నిలబెట్టుకోగలుతున్నాయని తెలిపారు. ఆనాటి నాయకులు ప్రగడ కోటయ్య చేనేత సొసైటీలను ఏర్పాటుచేసి చేనేత పరిశ్రమకు భరోసా కల్పించారని తెలిపారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వాలు చేనేత రక్షణ చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడంతో కార్మికులు పనులులేక ఆకలి చావులకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. చేనేతల డిమాండ్లు ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈనెల 30న రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మాజీ డీజీపీ జె. పూర్ణచంద్రరావు, హైకోర్టు న్యాయవాది వైకే, మాచర్ల మోహనరావు, విశ్రాంత కలెక్టర్ చిరంజీవు హాజరుకానున్నారని చెప్పారు. సదస్సులో వేలాదిగా చేనేత కార్మికులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గొర్రెపాటి రవికుమార్, వెంకటేశ్వరమ్మ, కాటి మార్కు, ఎం. శేషు, దానియేలు, కలామ్, పుల్లయ్య, సుధాకర్ పాల్గొన్నారు.


