విజ్ఞాన్‌ను సందర్శించిన అమెరికా వర్సిటీ బృందం
చేబ్రోలు: మండలంలోని వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీని యూఎస్‌ఏ– ఓహియోలోని బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ(బీజీఎస్‌యూ) ప్రతినిధుల బృందం శుక్రవారం సందర్శించింది. బీజీఎస్‌యూ ప్రెసిడెంట్ డాక్టర్ రోడ్నే కే. రోజర్స్, అడ్వకేట్ డాక్టర్ సాండ్రా బీ.ఎర్లే, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రవి క్రోవి, అకడమిక్ అఫైర్స్ వైస్ ప్రొవోస్ట్ డాక్టర్ రోడ్నే కే. రోజర్స్, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్– ఇన్నోవేషన్ డీన్ డాక్టర్ వేల్ మోక్తర్ సందర్శించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్ మాట్లాడుతూ విజ్ఞాన్– బీజీఎస్‌యూ మధ్య ఉన్న అవగాహన ఒప్పందం కేవలం విద్యార్థి మార్పిడికి మాత్రమే కాకుండా అంతర్జాతీయ విద్యా– పరిశోధనా సహకారం అని తెలిపారు. రెండు యూనివర్సిటీల అధ్యాపకులు ఒకరికొకరు వర్సిటీల్లో తాత్కాలికంగా బోధించే అవకాశం ఉంటుందని చెప్పారు. రెండు వర్సిటీల మధ్య సంయుక్త ఇన్నోవేషన్ సెంటర్లు, ల్యాబ్‌లు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. విమానయాన రంగానికి గ్లోబల్ ప్రమాణాలతో కూడిన మేనేజ్మెంట్ కోర్సులను సంయుక్తంగా రూపొందిస్తామని వివరించారు. డ్రోన్ మాన్యుఫాక్చరింగ్, వ్యవసాయం– సర్వేయింగ్, డిఫెన్స్ అప్లికేషన్లపై రీసెర్చ్ ల్యాబ్‌లను కలిసి అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు, ఐవోటీ సెన్సర్లు, స్మార్ట్ ఇరిగేషన్ వంటి టెక్నాలజీల అభివృద్ధిపై రెండు వర్సిటీలు కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు. బీజీఎస్‌యూ ప్రెసిడెంట్ డాక్టర్ రోడ్నే కే. రొజర్స్ మాట్లాడుతూ విజ్ఞాన్ యూనివర్సిటీతో మా భాగస్వామ్యం కేవలం విద్యా మార్పిడికే పరిమితం కాదు, రాబోయే టెక్నాలజీ ప్రపంచానికి భారత– అమెరికా విద్యార్థులను సిద్ధం చేసే సమగ్ర అకడమిక్ మిషన్ అని అన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, సీఈఓ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పీఎంవీ రావు పాల్గొన్నారు.


