జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ అందక రోగి మృతి..! | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ అందక రోగి మృతి..!

Nov 22 2025 7:34 AM | Updated on Nov 22 2025 7:34 AM

జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ అందక రోగి మృతి..!

జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ అందక రోగి మృతి..!

గుంటూరు మెడికల్‌: పేదల పెద్ద ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్‌లో గురువారం రాత్రి ఆక్సిజన్‌ అందక ఓ రోగి మృతిచెందినట్లు మృతుడి బంధువులు ఆరోపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి మధుమేహంతో బాధపడుతూ కాలికి రక్తనాళాల సమస్య ఏర్పడి తీవ్ర ఇబ్బందితో ఈనెల 12న గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స కోసం అడ్మిట్‌ అయ్యాడు. జనరల్‌ సర్జరీ వైద్యులు ఈనెల 16న ఆపరేషన్‌ చేసి కాలు తొలగించారు. ఆపరేషన్‌ అనంతరం ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. గురువారం ఐసీయూ నుంచి వార్డుకు తరలించగా, వార్డులో ఆరోగ్యం విషమించి ఆక్సిజన్‌ పెట్టాలని వైద్యులు సూచించారు. అయితే ఆక్సిజన్‌ పెట్టేందుకు కావాల్సిన మాస్క్‌ను బయట నుంచి కొని తెచ్చుకోమని బంధువులకు సూచించడంతో వారు రాత్రి కొనుగోలు చేసి వార్డుకు వెళ్లేసరికి సదరు వ్యక్తి మృతిచెందాడు. తక్షణమే మళ్లీ ఐసీయూకు తరలించి కొంతసేపు ఉంచి, చనిపోయినట్లు నిర్ధారించి తమకు అప్పగించారని మృతుడి బంధువులు వాపోయారు. వార్డులో వైద్యులు ఎవరూ అందుబాటులో లేరని, రాత్రి సమయంలో మహాప్రస్తానం వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో సొంత వాహనంలో గ్రామానికి తరలించినట్లు చెబుతున్నారు. ఆక్సిజన్‌ మాస్క్‌లు అందుబాటులో ఉంటే సకాలంలో ఆక్సిజన్‌ పెట్టి ఉంటే చనిపోయేవాడు కాదని, నిర్లక్ష్యంతోని చనిపోయాడని ఆరోపించారు. కాగా ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశస్వి రమణను ‘సాక్షి’ వివరణ కోరగా వార్డులో ఆక్సిజన్‌ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయినప్పటికీ బయట రోగి బంధువులతో కొనుగోలు చేయించిన వారికి మెమో జారీ చేస్తామని వెల్లడించారు.

24న ఏఎన్‌యూలో అస్మిత అథ్లెటిక్స్‌ లీగ్‌

గుంటూరు ఎడ్యుకేషన్‌: అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈనెల 24న ఏఎన్‌యూ క్రీడా మైదానంలో గుంటూరు జిల్లా అస్మిత అథ్లెటిక్స్‌ లీగ్‌ నిర్వహించనున్నట్లు హిందూ ఇంజినీరింగ్‌ కళాశాల డైరెక్టర్‌ పీఎం ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం అమరావతిరోడ్డులోని కళాశాలలో అండర్‌–14, అండర్‌ 16 బాలికల ఈవెంట్లకు సంబంధించిన పోస్టర్లను ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ సుబ్బారావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ వి.నర్సిరెడ్డిలతో కలసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ సౌజన్యంతో అస్మిత్‌ అథ్లెటిక్స్‌ లీగ్‌ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన బాలికలను దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌, విభాగాధిపతులు సుస్మితా చౌదరి, నాగాంజనేయులు, ఫిజికల్‌ డైరెక్టర్‌ కె.రవి పాల్గొన్నారు.

ఫుడ్‌ టెక్నాలజీలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

గుంటూరు రూరల్‌: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఏపీ ఈఏపీసెట్‌ 2025 ర్యాంకుల ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్‌, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ ప్రవేశాలకు చివరి విడత మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంవీ రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి గానూ బైపీసీ విభాగంలో ఏపీ ఈఏపీసెట్‌ 2025 ర్యాంకుల ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్‌, బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ ప్రవేశాలకు ఈనెల 24 నుంచి 30వ తేదీ వరకు చివరి విడత మాన్యవల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్‌ను సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement