బరువెక్కిన హృదయాలతో అంతిమ యాత్ర
14 రోజుల తరువాత
అమెరికా నుంచి ఇంటికి చేరిన
రాజ్యలక్ష్మి మృతదేహం
చివరి చూపు చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు, బంధువులు
కారంచేడు: తన కాళ్లపై తాను నిలబడుతూ.. తమకు కూడా అండగా ఉంటుందని భావించిన తల్లిదండ్రులకు ఆ కన్నకూతురు విగతజీవిగా ఇంటికి చేరింది. ఆ దృశ్యాన్ని చూసిన తల్లిదండ్రులు, తోబుట్టువు గండెలవిసేలా రోదించారు. బరువెక్కిన గుండెలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బాపట్ల జిల్లా కారంచేడు స్టేట్‌బ్యాంక్ ఎదురు బజారుకు చెందిన యార్లగడ్డ రామకృష్ణ, వీణాకుమారిలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేవలం రెండు ఎకరాల సాగుభూమితో కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవడంతో పాటు, బిడ్డలకు మంచి విద్యాబుద్ధులు నేర్పించడానికి రామకృష్ణ శ్రమించారు. కుమారుడు చిన్న ఉద్యోగం సంపాదించుకుంటే.. కుమార్తె యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23)ని బీటెక్ పూర్తి అయిన తరువాత అప్పులు చేసి ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా ఈ నెల 7న ఛాతీలో నొప్పి, కొద్దిగా దగ్గు రావడంతో సాధారణమని భావించి చికిత్స తీసుకోలేదు. ఎప్పటిమాదిరిగానే నిద్రపోయిన ఆమె మరుసటి రోజు తిరిగి లేవలేదు. విషయం గమనించిన స్నేహితులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఇండియాకు పంపడానికి వారు చాలా కష్టపడి నిధులు సేకరించారు. ఎట్టకేలకు 14 రోజుల శుక్రవారం మృతదేహాన్ని స్వగ్రామమైన కారంచేడులోని ఇంటికి తీసుకొచ్చారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు విగతజీవిగా ఇంటికి చేరడంతో ఆ తల్లితండ్రులు, సోదరుడు తల్లడిల్లిపోయారు.
కదలివచ్చిన ఊరు
రాజ్యలక్ష్మి మృతదేహం గ్రామానికి వచ్చిందని తెలుసుకున్న గ్రామస్తులు, ఆమె బంధువులు పెద్దఎత్తున తరలివచ్చారు. కడసారిగా ఆమె చివరి చూపును సూసేందుకు వచ్చిన గ్రామస్తులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. ప్రతి ఒక్కరూ రాజ్యలక్ష్మికి కన్నీటి వీడ్కోలు పలికారు.
బరువెక్కిన హృదయాలతో అంతిమ యాత్ర


