
వరద ముప్పును ఎదుర్కొనడానికి సిద్ధం
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
కొల్లూరు: వరద ముప్పును అధిగమించడానికి ప్రజల సహకారంతో అహ్నర్నిశలు శ్రమించి పనిచేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. కృష్ణా నదికి వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ గురువారం మండలంలోని దోనేపూడి, పెసర్లంక అరవిందవారధి, చిలుమూరులంక, సుగ్గునలంక లోలెవల్ వంతెనలను పరిశీలించారు. వరద సహాయక చర్యలపై తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిలుమూరులంకలో మూడు ఎస్టీ కుటుంబాలు వరదలకు నిర్వాసితులు కావడంతో వారికి ప్రభుత్వం తరపున చేపట్టిన సహాయ కార్యక్రమాల విషయంలో అధికారులు అశ్రద్ధగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులైన కుటుంబాలకు తక్షణం సురక్షిత ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించి, గృహ నిర్మాణాలు చేపట్టడంతోపాటు, వారికి ఆధార్, రేషన్, ఉపాధిహామీ పథకం జాబ్ కార్డులు మంజూరు చేయించాలని ఆదేశించారు.
ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు
వరదల కారణంగా ప్రజలు, పశువులకు ప్రాణ నష్టం వాటిల్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. వరద ప్రవహిస్తున్న మార్గాలు, ఇతర కీలక ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగంతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరద పెరిగితే వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు, రోగగ్రస్తులను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి యుద్ధప్రాతిపదికన తగు చర్యలు చేపట్టడానికి కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని 22 వరద ముంపు గ్రామాలలో ఇరువురు చొప్పున మండలస్థాయి అధికారులను, మండలానికో జిల్లా స్థాయి అధికారిని కేటాయించినట్లు చెప్పారు.
నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లిస్తాం
వరదల కారణంగా పలు గ్రామాలలో వాణిజ్య పంటలు ముంపునకు గురైనట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. వరద నీటిలో మునిగిన పంటలను వరదలు తగ్గిన వెంటనే ఉద్యాన, వ్యవసాయ శాఖల ద్వారా పంట నష్ట అంచనాలు రూపొందిస్తామన్నారు. పంట నష్టానికి ప్రభుత్వం నిర్దేశించిన పరిహారం అందజేయడంతోపాటు, ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
పంట భూముల కోతలు అరికట్టండి
వరదల కారణంగా పంట భూములు కోతలకు గురై నష్టపోతున్నామని మండలంలోని తిప్పలకట్ట ప్రాంతానికి చెందిన పలువురు రైతులు కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో పంట భూములు కోతకు గురికాకుండా గతంలో నిర్మించిన విధంగా గ్రాయిన్స్ నిర్మాణం చేపట్టడంతోపాటు, నది ఒడ్డును పటిష్ట పరచాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దోనేపూడి కరకట్ట దిగువున ఉన్న లోలెవల్ వంతెన, సుగ్గునలంక వద్ద ఉన్న లోలెవల్ వంతెనలు రహదారి ఎత్తుకు పెంచి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ గంగాధర్‌గౌడ్, రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి, కొల్లూరు తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు, ఆర్‌సీ ఏఈ విజయరాజు, ఎస్‌ఐ జానకి అమరవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.