గుంటూరు లీగల్ /చేబ్రోలు : మైనర్ కిడ్నాప్, హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1,100 జరిమానా విధిస్తూ గుంటూరు నాలుగవ అదనపు జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... గతేడాది జూలై 15వ తేదీన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో బాలికను కిడ్నాప్ చేసి, హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన నరమామిడి నాగరాజు కొత్తరెడ్డిపాలెం, చేబ్రోలులో నివాసం ఉండేవాడు. బాలిక తల్లి ఎస్తేరు రాణితో నాగరాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంబంధం బెడిసికొట్టిన తర్వాత ప్రతీకారంతో బాలికను తన ఇంటికి తీసుకువెళ్లి గొంతు నులిమి, హత్య చేశాడు.
మృతురాలి తండ్రి పేరుపోగు దావీదు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును తెనాలి ఎస్‌డీపీఓ బి.జనార్దనరావు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు నిర్వహించారు. న్యాయస్థానంలో నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణతో కేవలం ఏడాదిలోనే న్యాయస్థానంలో నిందితుడికి కఠిన యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ మేరకు బుధవారం నాలుగవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్‌బాబు తీర్పు వెలువరించారు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన పొన్నూరు రూరల్ సీఐ కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్సై వెంకటకృష్ణ, సీసీఎస్ పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
గుండెపోటుతో తుళ్లూరు ట్రాఫిక్ ఏఎస్‌ఐ మృతి
తాడికొండ: గుండెపోటుతో ట్రాఫిక్ ఏఎస్‌ఐ మృతి చెందిన ఘటన తుళ్లూరులో జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ ఏఎస్‌ఐగా పనిచేస్తున్న రవీంద్ర (55) విధులు ముగించుకొని కారు నడపుతూ వెళుతుండగా తుళ్లూరు శివారు సాయిబాబా ఆలయం వద్దకు రాగానే గుండెపోటుకు గురయ్యారు. కారును రోడ్డుపైనే నిలిపి పక్కకు పడిపోయారు. ఉన్నట్టుండి కారు నిలిచిపోవడంతో సమీపంలో ఉన్న ఏపీఎస్‌పీ సిబ్బంది కారు అద్దాలు పగలగొట్టి రవీంద్రను బయటకు తీసి తుళ్లూరు పీహెచ్‌సీకి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నవ వధువు ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లికి చెందిన రంగనాయకమ్మ (24)కు ఈ నెల 17వ తేదీన ఉండవల్లి సెంటర్‌లో నివాసం ఉంటున్న జితేంద్రతో వివాహం చేశారు. బుధవారం జితేంద్ర తన భార్య ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చాడు. పది నిమిషాల అనంతరం తిరిగి లోనికి వెళ్లేందుకు రాగా గదికి గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తీయకపోవడంతో అత్తకు చెప్పాడు. ఆమె పిలిచినా రంగనాయకమ్మ స్పందించలేదు. పక్కింటి వారి సహాయంతో జితేంద్ర తలుపులు పగలగొట్టగా.. రేకుల గదిలోని ఇనుప రాడ్‌కు చున్నీతో రంగనాయకమ్మ ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దించి వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏడాదిగా రంగనాయకమ్మకు కడుపునొప్పి ఉండడం వల్లే వివాహానికి నిరాకరించిందని, దానివల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఖాజావలి తెలిపారు.
వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంపు
కొరిటెపాడు: జిల్లాలో వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంప్ ‘లక్ష్య’, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాచురేషన్ క్యాంపు (జనన సురక్ష క్యాంప్)ను నగరంపాలెంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. క్యాంపును కడప రీజియన్ రీజినల్ హెడ్ ఈ. వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్య, ఫైనాన్షియల్ ఇంక్లూజ్ సాచురేషన్ క్యాంపునకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. క్రెడిట్ క్యాంపెయిన్ సమయంలో ఎస్‌హెచ్‌జీ గ్రూపులు, సీకేసీసీ రుణగ్రహీతలకు రుణాలు మంజూరు చేశామని తెలిపారు. కండ్లకుంట బ్రాంచ్ హెడ్ అశోక్‌కుమార్, సిబ్బందితోపాటు ఏపీఎం, ఇతర సీసీఏలు ఈ క్యాంపులో పాల్గొన్నారని చీఫ్ మేనేజర్ బి.కె.ప్రసాద్ తెలిపారు.