
ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
చీరాల అర్బన్: మున్సిపల్ రంగ కార్మికులు, ఉద్యోగుల సమస్యలు ఐక్య పోరాటాల ద్వారానే పరిష్కారం సాధ్యమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక ఎన్‌జే రంగనాయకులు బాపనమ్మ కల్యాణ మండపంలో బుధవారం జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన మహాసభలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చాప కింద నీరులా వర్క్ ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ముందుకు తెస్తోందని తెలిపారు. దీని వల్ల కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర నష్టాన్ని చవి చూస్తారని చెప్పారు. గతంలో కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించి కార్మికులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయని విమర్శించారు. ఉద్యోగాలను శాశ్వతం చేయడం, సమాన పనికి సమాన వేతనం, చట్టబద్ధ సౌకర్యాలు అమలు, రిటైర్మెంట్ ప్రయోజనాల హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులంతా రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్. మణిలాల్, ఉపాధ్యక్షుడు ఎం.వసంతరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కె.సామ్రాజ్యం, సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు ఎన్.బాబూరావు, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ఎలిజిబెత్, నెల్లూరు డివిజన్ కార్యదర్శి రామిరెడ్డి పాల్గొన్నారు.
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు