
కృష్ణమ్మ ఆగ్రహం.. తగ్గని ప్రవాహం
నదిలో ఉధృతంగా వరద దిగువకు 4.69 లక్షల క్యూసెక్కులు విడుదల లంక గ్రామాలకు తప్పని ప్రమాదం
కొల్లూరు : కృష్ణా నదిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. సముద్రంలోకి విడుదల చేస్తున్నా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 4.69 లక్షల క్యూసెక్కులను అధికారులు విడుదల చేశారు. దీంతో కొంతమేర నీటి ప్రవాహం తగ్గి, సాయంత్రానికి 4.56 లక్షల క్యూసెక్కుల వరద నీరు నదిలో ప్రవహిస్తోంది.
గ్రామాలను చుట్టుముట్టిన వరద నీరు
వరద నీరు గ్రామాలను చుట్టుముట్టింది. మండలంలోని పెసర్లంక అరవిందవారధి వద్దనున్న నక్కపాయ గండి, ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంక వద్ద, గాజుల్లంక సమీపంలో నది అంచులకు ప్రవహిస్తోంది. గతంలో పడిన గండ్ల నుంచి వరద నీటి ప్రవాహం లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకొని వెళ్లింది. ఇటుకల తయారీ కోసం తవ్విన భారీ గుంతలు వరద నీటితో నిండిపోయాయి. పెసర్లంక, గాజుల్లంక, ఆవులవారిపాలెం గ్రామాల చుట్టూ నీరు చేరింది.
ముంపు బారిన పంటలు
మండలంలోని పోతార్లంక, చింతర్లంక గ్రామాల పరిధిలోని పల్లపు ప్రాంత పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. అరటి, కంద, బీర, దొండ వంటి పంటలు స్వల్ప విస్తీర్ణంలో వరద ముంపు బారిన పడ్డాయి. పల్లపు భూముల్లోకి భారీగా వరద నీరు చేరింది. సాగులో ఉన్న పశువుల మేత వరద నీటిలో మునకకు గురైంది.
గ్రామాలకు నిలిచిన రాకపోకలు
మండలంలోని దోనేపూడి కరకట్ట దిగువున చినరేవులో వరద నీరు లోలెవల్ వంతెన పైనుంచి ప్రవహిస్తోంది. ఈ మార్గంలో పోతార్లంక, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, తోకలవారిపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు గాజుల్లంక, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.
రైతుల్లో ఆందోళన
వరద ప్రభావం కారణంగా మండలంలోని తిప్పలకట్ట సమీపంలో నది అంచున ఉన్న పంట పొలాలు భారీగా కోతలకు గురవుతున్నాయి. ఆ ప్రాంత రైతులు తీవ్ర నష్టానికి గురవుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని పెసర్లంక, కొల్లూరు కరకట్ట దిగువనున్న నక్కపాయ, గాజుల్లంక, ఆవులవారిపాలెం గ్రామాల పరిధిలోని ఇటుక బట్టీల్లోకి వరద నీటి ప్రవాహం చేరింది. దీంతో ఇటుక రవాణా ఈ ప్రాంతాల్లో స్తంభించింది. తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ జానకీ అమరవర్ధన్‌లు వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. వరద నీటిలో దిగవద్దని, అవసరమైన పక్షంలో పునరావాస కేంద్రాలకు తరలిరావడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

కృష్ణమ్మ ఆగ్రహం.. తగ్గని ప్రవాహం