
బీచ్ ఫెస్టివల్‌కు సర్వం సిద్ధం చేయండి
బాపట్ల: స్థానిక సూర్యలంకలో వచ్చే నెలలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో బీచ్ ఫెస్టివల్‌కు సూర్యలంక వేదిక కానుందని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లపై బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యాటక, సాంస్కృతిక, వినోద అంశాలను జోడించి, జిల్లా ప్రత్యేకతను చాటేలా ఈ వేడుకలు ఉండాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు పూర్తయితే సూర్యలంక జాతీయ, అంతర్జాతీయ పర్యాటక పటంలో నిలిచిపోతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో టూరిజం రీజినల్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్న, ఇనన్‌చార్జ్ జేసీ గంగాధర్ గౌడ్, ఆర్డీవో గ్లోరియా, డెప్యూటీ కలెక్టర్ నాగిరెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఏవో మల్లికార్జున,మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
ఉత్సవాల సందడి
బీచ్‌లో మూడు రోజుల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, బీచ్ క్రీడలు, సంగీత నృత్య వినోదం, ఫుడ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు సందర్శకులను అలరించనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూర్యలంక బీచ్‌కు రానున్నారు. అదే రోజు రూ.97 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
కలెక్టర్ జె.వెంకట మురళి