
డ్రగ్స్ ముప్పు నుంచి యువతను కాపాడుదాం
ఇన్‌చార్జి జేసీ గంగాధర్ గౌడ్
బాపట్ల: డ్రగ్స్ ముప్పు నుంచి యువతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్‌చార్జి జేసీ గంగాధర్‌గౌడ్ తెలిపారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణ, నివారణ చర్యలపై సమన్వయం కోసం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఇన్‌చార్జి జేసీ మాట్లాడుతూ మత్తు పదార్థాల ముప్పు నుంచి యువతను రక్షించడం అందరి ప్రధాన బాధ్యతగా భావించాలని చెప్పారు. ప్రతి శాఖ ఒకే దిశలో కృషి చేస్తేనే ఫలితం వస్తుందని తెలిపారు. పోలీసు, ఎకై ్సజ్ శాఖలతో పాటు హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, సోషల్ వెల్ఫేర్ విభాగాలు కూడా చురుకుగా పని చేయాలని ఆయన సూచించారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, స్కూల్–కాలేజీల్లో జాగృతి సదస్సులు నిర్వహించాలని చెప్పారు. మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టడంలో సామాజిక, స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు ఇంటిలిజెన్స్ బ్యూరో అదనపు ఎస్పీ బి. ఫణిరాజు శర్మ మాట్లాడుతూం డ్రగ్స్ వ్యాప్తి యువత జీవితాలను నాశనం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రైన్లు, బస్ స్టాండ్లు, పట్టణ శివారు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని తెలిపారు. గంజాయి తరలింపు, సరఫరాపై కఠిన నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే వలసలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు గ్లోరియ, చంద్రశేఖర్, రామలక్ష్మి, మెజిస్టీరియల్ సూపరింటెండెంట్ మల్లికార్జునరావు, క్రైమ్ డీఎస్పీ జగదీష్ నాయక్, బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, అధికారులు, ఎన్జీవోలు పాల్గొన్నారు.