
రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్ కట్
లబోదిబోమంటున్న దివ్యాంగుడు
నగరం: కూటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్లలో కోత పెడుతోంది. 90 శాతం పైగా అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు సైతం మొండిచెయ్యి చూపుతున్నారు. నగరం మండలం పెద్దమట్లపూడి గ్రామానికి చెందిన లుక్కా నాగరాజుకు 90 శాతం అంగవైకల్యం ఉండడంతో 2011వ సంవత్సరం నుంచి పింఛన్ పొందుతున్నాడు. వికలాంగ పింఛన్ పొందుతున్న వారు మరోమారు వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రీ వెరిఫికేషన్‌కు వెళ్లిన నాగరాజుకు నిరాశ ఎదురైంది. పింఛన్ పొందేందుకు సరిపడినంత అంగవైకల్యం లేదని సచివాలయానికి సర్టిఫికెట్లు వచ్చాయి. నాగరాజు పింఛన్ నగదుపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఇప్పుడు పింఛన్ నిలిపివేసినట్లు అధికారులు చెప్పడంతో తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.