
‘కృష్ణా’లో పెరుగుతున్న వరద ఉద్ధృతి
మొదటి ప్రమాద హెచ్చరికతో అప్రమత్తంగా ఉండాలని సూచన
కొల్లిపర: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్, ఇతర జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. దీతో కృష్ణా నదికి సుమారుగా 5 లక్షల క్యూసెక్కులు వరద నీరు రాగా, మంగళవారం అధికారులు ఈ మేరకు దిగువకు వదిలారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తహసీల్దార్ జి.సిద్ధార్థ, ఎస్సై కోటేశ్వరరావులు తెలిపారు. మండలంలోని లంక గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 24 గంటల్లో కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. లంక గ్రామంలోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. నదులు, ఇతర జల వనరుల వద్దకు ప్రజలు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసరమైతే అధికారుల దృష్టికి తీసుకొచ్చి పడవ వేయాలని నడిపే వ్యక్తులకు ఆదేశించారు. పాడి రైతులు పశువులను నదిలో దించడానికి ప్రయత్నించరాదని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.