
నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ పుల్లారెడ్డి
చీరాల అర్బన్: ప్రతి వినియోగదారుడికి నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పాపరాజుతోటలోని బాపనమ్మ కల్యాణ మండపంలో జిల్లా విద్యుత్‌శాఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో లోఓల్టేజీ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ప్రజాభిప్రాయసేకరణలో మంచి ఫలితం సాధించాలని సూచించారు. ఆర్‌డీఎస్‌ఎస్ పనులు సకాలంలో పూర్తిచేసి వినియోగదారులకు అందించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అలానే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరితగతిన వినియోగదారులకు అందించాలని, రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల మీద వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్‌ఈ ఆంజనేయులు, డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్సు ఎన్.వెంకటేశ్వర్లు, జిల్లాలోని ఈఈలు, డీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.