
లంక గ్రామాలను భయపెడుతున్న వరద
ఉదయం 2.89 లక్షల క్యూసెక్కులు విడుదల
మధ్యాహ్ననికి తగ్గిన వరద ఉధృతి
లోతట్టు ప్రాంతాల్లో తగ్గని నీటి నిల్వలు
కొల్లూరు: లంక గ్రామాల ప్రజలను వరద భయం వెంటాడుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటి విడుదల చేస్తున్న వరద నీటి ప్రవాహం ఇరవై రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తోంది. తెలంగాణాతోపాటు, ఎగువ ప్రాంతాలలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతుంది. నాలుగు రోజుల కిందట 5.75 లక్షల క్యూసెక్కులు నదికి రావడంతో లోతట్టు ప్రాంతాలలోకి వరద నీరు చొచ్చుకువచ్చింది. పంటలు ముంపునకు గురయ్యాయి. ఆ తర్వాత వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. తిరిగి ఆదివారం రాత్రి నుంచి పెరుగుతూ వచ్చింది. సోమవారం ఉదయం కృష్ణా నదికి 2.89 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. అయితే వరద నీటి విడుదల క్రమంగా తగ్గుతూ 2.50 లక్షలకు చేరింది. నదిలో ప్రవాహ తీవ్రత కొంత మేర తగ్గింది.
లోలెవల్ వంతెన మీదుగా ప్రవాహం
కృష్ణా నదిలో కొనసాగుతున్న వరద ప్రవాహం కారణంగా లోతట్టు ప్రాంతాలలోకి వరద నీరు చేరుతుంది. నాలుగు రోజుల కిందట వచ్చిన వరద కారణంగా మండలంలోని పెసర్లంక, గాజుల్లంక, ఆవులవారిపాలెం ప్రాంతాలలోని ఇటుక బట్టీల మట్టి కోసం తవ్విన గుంతలలోకి వరద నీరు భారీగా చేరింది. ప్రస్తుతం విడుదల చేస్తున్న వరద నీరు కారణంగా గాజుల్లంక చినరేవు నుంచి ప్రవహిస్తున్న వరద నీటి తీవ్రత అధికమైంది. దీంతో దోనేపూడి కరకట్ట దిగువనున్న లోలెవల్ వంతెన మీదుగా నీరు ప్రవహిస్తుంది. లోలెవల్ వంతెనపై నుంచి వరద నీటి ప్రవాహం కారణంగా మండలలోని పోతార్లంక, తోకలవారిపాలెం, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి తదితర గ్రామాల ప్రజలు గాజుల్లంక, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామాల మీదుగా రాకపోకలు సాగించాల్చిన పరిస్థితి తలెత్తింది.