
కరకట్ట భద్రతకు పటిష్ట చర్యలు
ఆర్‌సీ ఏఈఈ నాగేశ్వరనాయక్
రేపల్లె: బలహీనంగా ఉన్న కృష్ణా కరకట్టలను పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్‌సీ ఏఈఈ నాగేశ్వరనాయక్ చెప్పారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు వస్తున్నందన సోమవారం ఆయన ఓలేరు నుంచి లంకెవానిదెబ్బ వరకు కరకట్టను పరిశీలించారు. బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ఓలేరు పల్లెపాలెం వద్ద బలహీనంగా ఉన్న కరకట్టను పటిష్ట పరిచే చర్యలు చేపట్టారు.
వరద ఉధృతి పెరిగినా కరకట్టలకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు. ముందస్తుగా ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2009 వరదల సమయంలో కోతకు గురైన కరకట్ట ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు అధిక మొత్తంలో వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. వరద నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున కృష్ణా నదిలోకి చాపల వేటకు మత్స్యకారులు వెళ్లరాదని సూచించారు. నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.