తెనాలి రూరల్: భార్యకు విడాకులివ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్న భర్తపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన లింగంశెట్టి ఉమామహేశ్వరరావు 2003లో భూలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు విడాకులివ్వకుండానే 2012లో మరో మహిళను వివాహం చేసుకోగా ఇద్దరు కుమార్తెలు కలిగారు. రెండో భార్య కుమార్తెల పేరున ఉమామహేశ్వరరావు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు తీసుకుని ఆస్తి రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేయించాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య భూలక్ష్మి ఆధారాలతో పోలీసును ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్‌ఐ కె.ఆనంద్ తెలిపారు.
ఆటో: ద్విచక్ర వాహనం ఢీ
పెదకూరపాడు: ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు గాయపడిన సంఘటన మండలంలోని పెదకూరపాడు– లింగంగుంట్ల మధ్య ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పాటిబండ్లకు చెందిన మన్నవ జోసఫ్, జలాల్‌పురం గ్రామానికి చెందిన మన్నవ కిరణ్‌లు పెదకూరపాడు వచ్చి తిరిగి వెళుతున్నారు. ఇదే సమయంలో పొడపాడు నుంచి ఆటోలో ప్రయాణికులతో సారెకుక్క జోసఫ్ పెదకూరపాడు వస్తున్నాడు. ఈ క్రమంలో పెదకూరపాడు–లింగంగుంట్ల వద్ద మూల మలుపులో రెండు వాహనాలు ఢీకొన్నాయి.
ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న జోసఫ్, కిరణ్‌లు నాలుగు అడుగులు మేర ఎత్తుకు ఎగిరి రోడ్డుపై పడ్డారు. జోసఫ్‌కు తలకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్ తలకు బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఆటో డ్రైవర్ సారెకుక్క జోసఫ్‌కు కూడా గాయాలయ్యాయి. ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సహాయంతో గాయపడిన వారిని పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరుకు తరలించారు. ఇందులో కిరణ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఎన్‌ఆర్‌ఐ మహిళ బ్యాగ్ చోరీ
పట్నంబజారు: ఎన్‌ఆర్‌ఐ మహిళ బ్యాగ్ చోరీ అయిన ఘటన గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళ గుంటూరుకు చేరుకున్నారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లో దిగిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమె బ్యాగ్‌ను గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పాత గుంటూరు పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశారు. సుమారు పాతిక సవర్లకు పైగా, పెద్ద ఎత్తున నగదు దోచుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని పాత గుంటూరు పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఏ ఒక్కరికీ తెలియకుండా, మీడియాకు సమాచారం తెలియకుండా దాచిపెట్టారు. ఇప్పటికే పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గత పది రోజుల్లో భారీ చోరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో అధికారులు సమాచారాన్ని మీడియాకు తెలియకుండా దాచి ఉంచారని సమాచారం.