
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మంగళగిరి టౌన్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరి పంట రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 70 వేల ఎకరాల వరి పంట రైతులు నష్టపోయినట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో పంట వేసినప్పుడు వర్షాలు లేక పంట ఎండిపోయిందని, అప్పుడు ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి పెట్టారని, రెండోసారి వరిపంటవేసిన తరువాత అకాల వర్షాల కారణంగా నష్టపోయారని అన్నారు. గుంటూరు చానల్, కొండవీటివాగును రెండువైపులా వెడల్పు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే నష్టానికి కారణమన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జేవీ రాఘవులు, జిల్లా నాయకులు ఎస్‌ఎస్ చెంగయ్య, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు కమలాకర్ పాల్గొన్నారు.
యువకుడిపై కత్తితో దాడి
తెనాలిరూరల్: పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసి గాయపర్చిన ఘటన మండలంలోని కొలకలూరులో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉన్నం చినజాన్, సుద్దపల్లి రవీంద్రకు గతంలో విభేదాలున్నాయి. ఇరువురు కలసి మద్యం తాగే క్ర మంలో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. రవీంద్ర తనతో తెచ్చుకున్న కత్తితో జాన్‌పై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం తాడేపల్లిలోని ప్రైవేటు వైద్యశాలకు పంపారు. జాన్ ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి