
యువతీ, యువకులు ఆధ్యాత్మికంగా ఎదగాలి
నేషనల్ యూత్ ఫెస్టివల్‌లో ప్రముఖ సినీ నటుడు భానుచందర్
చీరాల రూరల్: యువతీ, యువకులు చెడునడతలను విసర్జించి చదువుతోపాటు ఆధ్యాత్మికంగా ఎదగాలని సినీ నటుడు భానుచందర్ సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జీసస్ వర్షీఫ్ సెంటర్ నిర్వహకులు డాక్టర్ నోవా అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో జాతీయ యూత్ ఫెస్టివల్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు భానుచందర్ పాల్గొని తన జీవితంలో ప్రభువైన ఏసుక్రీస్తు చేసిన అద్భుతాలను తన కుటుంబ సాక్ష్యంగా యువతీయువకులకు ఎంతో విపులంగా వివరించారు. ప్రతి ఒక్కరూ బైబిల్‌లోని పది ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే ఏసుక్రీస్తును ఆరాధించినట్లేనని చెప్పారు. తనవలే తన పొరుగువారిని ప్రేమించాలని ఏసుక్రీస్తు చెప్పారని ప్రతి ఒక్కరూ ఎదుటివారిపై సోదర ప్రేమను చూపాలని సూచించారు. రోజులు బహు చెడ్డగా ఉన్నవని ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని తన రక్షకునిగా స్వీకరించి మారుమనస్సు పొందాలని సూచించారు. కార్యక్రమంలో యువతి, యువకులు వీనులవిందైన సంగీతాల మధ్య దేవుని గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో నిర్వహకులు డాక్టర్ నోవా అజయ్‌కుమార్ ఆయన సతీమణి రమా ఏంజలిన్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతి, యువకులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు.