
వైఎస్సార్ సీపీని బలహీనపరిచేందుకు కూటమి కుట్ర
వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ఉపాధ్యక్షుడు భవనం శ్రీనివాసరెడ్డి
పర్చూరు (చినగంజాం): రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీని బలహీనపరచాలన్నదే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వంలోని టీడీపీ కుట్ర చేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ఉపాధ్యక్షుడు భవనం శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 50కి పైగా జెడ్పీటీసీ స్థానాలు ఖాళీలుంటే కేవలం వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించడం కూటమి ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్‌ల పర్వం ముగిసి మరో రెండు రోజుల్లో పోలింగ్ జరుగుతుందన్న పరిస్థితుల్లో పోలింగ్ బూత్‌ల మార్పు చేయడమనేది రాష్ట్ర చరిత్రలోనే ఎన్నికల కమిషన్ తీసుకున్న దురదృష్టకరమైన చర్య అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థకు తూట్లు పొడిచేలా ఎన్నికలు నిర్వహించడమే కాక పోలింగ్ బూత్‌లలోకి ఏజెంట్లను పోనివ్వకుండా నిలుపుదల చేయడం, పోటీ చేసిన అభ్యర్థిని కనీసం ఓటువేసేందుకు కూడా రానివ్వకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ గూండాలు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం అన్నారు. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తాను పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఇంతటి దారుణమైన ఎన్నికల ప్రక్రియను చూడలేదని అన్నారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికల జరుగుతున్న తీరు ఎన్నికల కమిషన్‌కు సిగ్గు చేటు అన్నారు.