సారూ..డబ్బులు ఎప్పుడిస్తారు!
● ఏప్రిల్ 1న కొత్తగొల్లపాలెంలో చంద్రబాబు పింఛన్ల పంపిణీ ● సీఎం వస్తున్నారని మార్చి 28న రైతుల ధాన్యాన్ని తీసుకెళ్లిన అధికారులు ● ఏడు రైస్ మిల్లులకు మూడు వేల బస్తాల ధాన్యం తరలింపు ● రెండునెలలు దాటినా రైతుల ఖాతాలకు డబ్బులు జమచేయని ప్రభుత్వం ● కలెక్టరేట్ చుట్టూ అన్నదాతల ప్రదక్షిణ ● రేపు, మాపు అంటూ దాటవేస్తున్న అధికారులు ● రూ.50 లక్షలు ఆగిపోవడంతో లబోదిబోమంటున్న అన్నదాతలు
సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనేది పాత సామెత. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అన్నదాతలను నిలువునా ముంచింది. బాబుగారు వస్తున్నారని కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని హడావుడిగా ఎత్తుకెళ్లారు. ధాన్యం తీసుకున్న 48 గంటల్లోనే డబ్బులు జమచేస్తామని చెప్పిన అధికారులు 1440 గంటలు (60 రోజులు) దాటుతున్నా ఒక్క రూపాయి కూడా జమచేయలేదు. ఇప్పటికి పలుమార్లు జిల్లా కలెక్టర్‌ను కలిసి మొరపెట్టుకున్నా వారి సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. అదిగో వేస్తాం ఇదిగో వేస్తామంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా డబ్బులు ఇవ్వాలని వేడుకుంటున్నారు.
జరిగింది ఇలా..
ఏప్రిల్ ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చినగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామానికి వచ్చారు. అప్పటికే రైతులు హార్వెస్టింగ్ పూర్తిచేసుకొని కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకున్నారు. ఇళ్లల్లో వసతి లేక కొందరు ఆరిన ధాన్యాన్ని ఆరు బయటనే నిల్వ చేశారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనలేదని రైతులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. మొట్టికాయలు పడతాయని భయపడ్డ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కలెక్టర్ వెంకట మురళి, అప్పటి జేసీ ప్రఖర్‌జైన్, పౌరసరఫరాల అధికారి విలియమ్స్‌లు ధాన్యాన్ని ఇళ్లలో దాచుకోవాలని రైతులకు సూచించారు. వసతి లేదని వారు నిరాకరించారు. బెంబేలెత్తిన అధికారులు హుటాహుటిన 60 మంది రైతులకు చెందిన 3,000 బస్తాల ధాన్యాన్ని తూకాలు వేచించి ట్రాక్టర్ల ద్వారా చీరాల, వేటపాలెం, ఈపురుపాలెంల పరిధిలోని రాధాకృష్ణ, చెక్కబాబు, మారుతీట్రేడర్స్, బాలాజీ, వసంతలక్ష్మి, సుబ్రమణ్యం ట్రేడర్స్, సత్యనారాయణ రైస్‌మిల్లులకు తరలించారు. 48 గంటల్లో మద్దతు ధర ప్రకారం బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని రైతులతో నమ్మబలికారు. ధాన్యం మిల్లులకు చేరడంతో కనీసం వారంలో డబ్బులు పడతాయని ఆశగా ఎదురు చూసిన రైతులకు నిరాశ తప్పలేదు. నెలలు దాటుతున్నా రైతుల ఖాతాల్లో పైసా జమకాలేదు.
కొంపముంచిన అధికారుల హడావుడి
రైతులు ధాన్యాన్ని అమ్మాలంటే వ్యవసాయ సహాయకులు ఇచ్చే ఈ క్రాప్ వివరాలతోపాటు షెడ్యూలింగ్, డేటా ఎంట్రీ, ఆర్‌ఎస్‌కె ఇచ్చే ట్రాక్ షీట్, జీపీఎస్ వెహికల్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్, మిల్లు నుంచి ఎక్‌నాలెడ్జిమెంట్‌లు అవసరం. ఇవన్నీ లేకుండా రైతు ధాన్యం కొనడం, డబ్బులు ఖాతాల్లో వేయడం జరగదు. సీఎం సభలో రైతులు గొడవచేయకూడదన్న అజెండాతో అధికారులు నిబంధన లు పాటించక ధాన్యాన్ని మిల్లులకు తరలించడంతో సాంకేతిక సమస్యలతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయలేని పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
48 గంటల్లో ఇస్తామన్నారు... 1440 గంటలు గడిచిపోయింది..
లక్ష బస్తాల దిగుబడి..
కొన్నది మూడు వేల బస్తాలే..
నమ్మించి మోసగించారు
పది ఎకరాల్లో వరి సాగు చేశాను. ముఖ్యమంత్రి వచ్చేముందు వరకు కల్లాల్లోనే ధాన్యం ఉంది. అధికారులు వచ్చి ధాన్యం మిల్లులకు తరలిస్తామన్నారు. ట్రాక్టర్ బాడుగలు, కాటా కూళ్లు మా చేతే పెట్టించారు. 200 బస్తాల ధాన్యం ఈపురిపాలెం చెక్కా బాబు మిల్లుకు తోలాం. తేమశాతం లేకపోయినా క్వింటాకు 12 కేజీలు కోత పెట్టారు. ప్రభుత్వం ధాన్యం డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వలేదు. అధికారులు పలకడంలేదు.
– వడ్లమూడి హరిబాబు,
రైతు, కొత్తగొల్లపాలెం
మాడబ్బులు మాకివ్వాలి
నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. 112 బస్తాల ధాన్యం మిల్లులకు తోలాం. ఈ క్రాప్ వివరాలతోపాటు పద్ధతి ప్రకారం ధాన్యం కొనడంలేదని అనుమానించాం. అయినా కలెక్టర్, జిల్లా అధికారులు వచ్చి దగ్గరుండి ధాన్యం మిల్లులకు పంపిస్తుంటే డబ్బులు ఇస్తారని అనుకున్నాం. ఇంతలా మోసగిస్తారని అనుకోలేదు. రెండునెలలు దాటినా పైసా ఇవ్వలేదు. వెంటనే డబ్బులు ఇవ్వాలి.
– ఎల్లవల సురేష్, రైతు, కొత్త గొల్లపాలెం
ఆవులదొడ్డి కొత్తగొల్లపాలెం గ్రామంలో ఖరీఫ్ సీజన్‌లో 1500 ఎకరాల్లో వరి సాగుచేయగా ఎకరాకు 30 నుంచి 35 బస్తాల చొప్పున 45 వేల బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. రబీలో దాదాపు 2 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 60 వేల బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. ఖరీఫ్‌లో 90 వేల మెట్రిక్ టన్నులు, రబీలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి పర్యటన నాటికి కొత్త గొల్లపాలెంలో ఒక్క బస్తా ధాన్యాన్నికూడా కొనలేదు. ముఖ్యమంత్రి పర్యటన పుణ్యమాని 3 వేల బస్తాలైనా కొన్నారు. వాస్తవానికి ట్రాక్టర్ బాడుగలు, ధాన్యం కాటాల డబ్బులను సైతం మాతోనే పెట్టించారని రైతులు వడ్లమూడి హరిబాబు, మల్లయ్య, అంజయ్య, సోమయ్య, సురేష్, నాగరాజు, రమేష్, గోపి, వెంకటేశ్వర్లు, గడ్డం సూరి ‘సాక్షి’తో వాపోయారు. ఇప్పటికై నా ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
సారూ..డబ్బులు ఎప్పుడిస్తారు!
సారూ..డబ్బులు ఎప్పుడిస్తారు!


