ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ, రైల్వే, పర్యాటక, ఫిషరీస్, విద్య, వైద్య శాఖలకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం, రహదారులు మెరుగ్గా ఉంటే అభివృద్ధి జరుగుతుందన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల నిర్మాణాలతో ప్రజల ప్రయాణాలు ఎంతో సులభంగా మారుతాయన్నారు. వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి–167ఏ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు–నిజాంపట్నం రహదారి నిర్మాణం, నిడుబ్రోలు–చందోలు ఆర్ అండ్ బీ రహదారి విస్తీర్ణం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కర్లపాలెం–గణపవరం రహదారి పనులు పురోగతిపై ప్రతివారం నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ లో నిర్మాణాలు వేగంగా చేపట్టాలన్నారు.
పార్కింగ్ సమస్య లేకుండా చూడాలన్నారు. హరిత రిసార్ట్స్ భవనం ఆధునికీకరణ పనులు వేగంగా చేపట్టాలన్నారు. చీరాల ఏరియా ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం అత్యంత వేగంగా చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ నిర్మాణం త్వరలో పూర్తిచేసి ప్రారంభించాలన్నారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


