వేటపాలెం: కల్తీ ఆహారం విక్రయించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ప్రణీత్ హెచ్చరించారు. వేటపాలెం బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద గల గాయిత్రి బిర్యాని హోటల్‌లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చికెన్, మటన్, పలావుల్లో కల్తీ ఉన్నట్లు తరచూ ఆరోపణలు రావడంతో తనిఖీలు చేశామన్నారు. హోటల్ ప్రాంగణంలో అపరిశుభ్రంగా ఉందని, నిల్వ ఉంచిన మాంసాన్ని వండి విక్రయిస్తున్నట్లు సమాచారం అందిన్నట్లు తెలిపారు. హోటల్‌లోని చికెన్, మటన్, ఇతర పదార్థాలను, వంట నూనెలను ఆయన పరిశీలించారు.
పాలిసెట్‌లో జిల్లా విద్యార్థికి రాష్ట్ర స్థాయి ర్యాంకు
బల్లికురవ: పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫలితాల్లో బల్లికురవ మండలంలోని కొప్పరపాడు ఉన్నత పాఠశాల విద్యార్థి కంభాల నాగసాయి చరణ్‌తేజ రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించినట్లు ఆ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు జి.నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. 120 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో 119 మార్కులు కై వసం చేసుకుని రాష్ట్రస్థాయిలో 69వ ర్యాంకు, బాపట్ల జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించినట్లు చెప్పారు. ఇటీవల విడుదల అయిన పదో తరగతి ఫలితాల్లో 590 మార్కులు పొందిన చరణ్‌తేజ మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విషయం విదితమే. చరణ్‌తేజను పాఠశాల ఉపాధ్యాయులు, సీఎంసీ, గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు.
హోమ్స్‌ను సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
గుంటూరు లీగల్: క్యాలెండర్ యాక్టివిటీస్‌లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు బుధవారం గుంటూరులోని హోమ్స్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సందర్శించారు. దిశా వన్ స్టాప్ సెంటర్, శిశు గృహం, స్వధార్ హోమ్, లీమా డెఫ్ అండ్ డమ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. అక్కడున్న అధికారులతో మాట్లాడారు. పిల్లలకు అందుతున్న విద్య, వైద్య సదుపాయాలు, రూంలను పరిశీలించారు. దిశా వన్ స్టాప్ సెంటర్, స్వధార్ హోమ్‌లో మహిళలకు అందుతున్న సదుపాయాల గురించి వాకబు చేశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి రిజిస్టర్స్‌ను పరిశీలించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఫ్రీ లీగల్ ఎయిడ్, బాధిత మహిళలకు అందే పరిహారం గురించి వివరించారు. కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్ కట్టా కాళిదాసు, హోమ్ నిర్వాహకులు పాల్గొన్నారు.
విపత్తుల నిర్వహణపై అవగాహన అవసరం
గుంటూరు వెస్ట్: ప్రకృతి వైపరీత్యాలు, భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కనీస అవగాహన ఉంటే ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) షేక్ ఖాజావలి అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన మాక్ డ్రిల్‌లో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు భయాందోళనకు గురికాకూడదని తెలిపారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వీలైనంత వరకు నష్టం తగ్గించడం మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఫైర్ వస్తోందని తెలుసుకోవడానికి ముందుగా పొగను గుర్తించాలని, ఆ సమయంలో ఇంట్లో ఉన్నవారంతా బయటకు వచ్చేయాలని తెలిపారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.లక్ష్మీకుమారి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కల్తీ ఆహార విక్రయాలపై కఠిన చర్యలు


