కాటేసిన కరెంట్ తీగ
చేనేత కార్మికుడు మృతి
వేటపాలెం: అకాల వర్షం కారణంగా కరెంట్ తీగ రూపంలో చేనేత కార్మికుడిని మృత్యువు కాటేసింది. ఈ సంఘటన దేశాయిపేట పంచాయతీ ఆణుమల్లిపేటలో బుధవారం తెల్లపారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. తెల్లపారుజామున గాలితో కూడిన వాన కురిసింది. ఈదురు గాలులకు కరెంట్ షార్టు సర్క్యూట్‌తో ఇంటికి వేసిన సర్వీస్ వైరు తెగి రోడ్‌పై పడింది. ఉదయాన్నే పాలు తెచ్చుకోవడానికి బొడ్డు మోహన్‌రావు (64) రోడ్డుపైకి వచ్చాడు. రోడ్డుకు అడ్డుగా పడి ఉన్న కరెంటు తీగను పక్కకు తొలగించే ప్రయత్నం చేశాడు. తెగి పడిన సర్వీస్ వైరులో విధ్యుత్ ప్రవహిస్తుండటంతో షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు గుర్తించి విద్యుత్ శాఖ సిబ్బంది సమాచారం అందించారు. వారు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎం.వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మోహన్‌రావు చేనేత మగ్గం పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


