స్నేహ బంధం.. అజరామరం
కొల్లూరు : మనసు రెక్కలు తొడిగి ఐదు పదుల వెనక్కి పరుగులెట్టింది. చిన్ననాటి స్నేహబంధం చిరునామాలో వాలిపోయింది. ఆనాటి అనుభూతులను గుర్తుచేసుకుని నవ్వులొలికింది. ఆ అనుబంధం అజరామరం అంటూ నినదించింది. ఈ స్నేహ సంబరానికి కొల్లూరు ఎంప్లాయిస్ రిక్రియేషన్ హోమ్ వేదికై ంది. కొల్లూరు జెడ్పీ హైస్కూల్‌లో 1974–75 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలలో దేశ, విదేశాలలో స్థిర పడిన అలనాటి విద్యార్థులు తరలివచ్చారు. అప్పటి స్నేహితులను ఆప్యాయంగా పలకరించారు. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. 50 ఏళ్ల అనంతరం కలుసుకోవడంతో పూర్వ విద్యార్థులు ఉద్వేగానికి లోనయ్యారు. ఆనందబాష్పాలు రాల్చారు. ఇకపై తరచూ కలవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం అప్పట్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు నలుగురిని సత్కరించి ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం బాధాతప్త హృదయాలతో వీడ్కోలు తీసుకున్నారు.
1974–75 పదో తరగతి
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
స్నేహ బంధం.. అజరామరం


