చోరీ కేసును ఛేదించిన బాపట్ల పోలీసులు
బాపట్లటౌన్: జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిన ఇంకొల్లు చోరీ కేసును బాపట్ల పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. రూ.75 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. వివరాలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 3 అర్ధరాత్రి సమయంలో ఇంకొల్లులోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నివాసం ఉంటున్న జాగర్లమూడి శివ ప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీలో రూ.55 లక్షల నగదు, రూ.24 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు క్లూస్‌టీం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వివరాలు సేకరించి అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకొని దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు.
దొంగతనం జరిగింది ఇలా..
చోరీకు పాల్పడిన మహమ్మద్ షరీఫ్ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అమీద్‌పురం గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను గతంలో చెంచల్‌గూడ సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో అదే జైలులో గంజాయి కేసులో ముద్దాయి అయిన ఇంకొల్లు గ్రామానికి చెందిన సాయితో పరిచయం అయ్యింది. ఆ పరిచయంతో ఇరువురు స్నేహితులయ్యారు. వారిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ ఏడాది మార్చి 30న షరీఫ్ ఇంకొల్లులోని సాయి ఇంటికి వచ్చాడు. సాయి నిర్వహిస్తున్న హోటల్‌లో వంట మాస్టర్‌గా చేరాడు. నాలుగు రోజులుగా పక్కా ప్లాన్ చేసుకొని ఈనెల మూడున అర్ధరాత్రి శివప్రసాద్ ఇంటి వెనుక వైపు ఉన్న మెట్ల ద్వారా గోడపైకి ఎక్కి తాళాలు పగలకొట్టి పెంట్‌హౌస్‌లోకి చొరబడ్డారు. బాధితుడు రెండవ అంతస్తులో నిద్రిస్తుండగా మూడో అంతస్తులో ఉన్న బీరువా ఉన్న గది తాళాలు, బీరువా తాళాలను ఇనుప కడ్డీలు, రాడ్డుల సహాయంతో పగలకొట్టి సొమ్మును దోచుకెళ్లారు. ముద్దాయిపై ఇప్పటికీ 14 కేసులు ఉన్నాయి.
రూ.75.50 లక్షల సొత్తు రికవరీ
చోరీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు రూ.55.50 లక్షల నగదు, బంగారు గాజులు–7 జతలు (17 సవర్లు), బంగారు నానుతాడు–1 (2.5 సవర్లు), బంగారు గొలుసు–1 (రెండున్నర సవర్లు), బంగారు ఉంగరం–1 (అర సవరు), చెవి బుట్టలు ఒక జత (1/2 సవర్లు), చెవి దిద్దులు మూడు జతలు (3/4 సవర్లు) మొత్తం 24 సవర్ల బంగారం, వాటి విలువ రూ.20,00,000. మొత్తం విలువ రూ. 75.50 లక్షల సొమ్మును రికవరీ చేశారు.
పోలీసులకు అభినందన
నేరం జరిగిన 24 గంటలలోనే నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ కనబరిచిన చీరాల డీఎస్పీ మహమ్మద్ మొయిన్, ఇంకొల్లు సర్కిల్ సీఐ వై.వి.రమణయ్య, ఇంకొల్లు ఎస్‌ఐ జి.సురేష్, ఇంకొల్లు పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ జి.వీర్రాజు, కానిస్టేబుల్ కె.హరిచంద్రనాయక్, జి.కె.వి సుబ్బారావు, ఎ.ముకేష్‌వర్మ, హోంగార్డులు కె.పనిత్‌కుమార్, ఎన్.శరత్‌బాబులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతిని అందజేశారు.
24 గంటల్లోనే రూ.75 లక్షల సొత్తు రికవరీ అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ తుషార్‌డూడీ


