వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కారరావు
గుంటూరు మెడికల్: ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్య వర్గ సమావేశం ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న డ్రైవర్స్ అసోసియేషన్ హాలులో జరిగింది. ముఖ్యఅతిథిగా వచ్చిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. ఆస్కార రావు మాట్లాడుతూ తాము ప్రభుత్వం ముందు ఉంచిన సమస్యలన్నీ ఆర్థికేతర అంశాలేనని చెప్పారు. తమ సంఘం తరఫున సుమారు 28 డిమాండ్‌లను లిఖిత పూర్వకంగా తెలియజేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం నేటికీ వాటిని పరిష్కరించిన పాపానపోలేదని వాపోయారు. ఇక పోరాటం తప్పదని తేల్చి చెప్పారు. త్వరలో సమ్మె నోటీసు జారీ చేస్తామన్నారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆహారోన్ మాట్లాడుతూ తమ సంఘాన్ని బలోపేతం చేయడం ద్వారా ఉద్యమానికి జిల్లా శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికారులు సత్వరమే మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలన్నారు. సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ సాగర్ మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేసుకోవాల్సిన సమయం అసన్నమైందన్నారు. ముఖ్య సలహాదారు రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొనాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు సాగర్, రాష్ట్ర కోశాధికారి బాబా సాహెబ్, ఉపాధ్యక్షులు లక్ష్మీ నారాయణ, కృష్ణారెడ్డి, సయ్యద్ చాంద్ బాషా, దుర్గా ప్రసాద్, సత్యనారాయణ బాబు, అపరంజమ్మ తదితరులు పాల్గొన్నారు.