
విశేషాలంకారంలో అమరేశ్వరుడు ప్రత్యేక అలంకరణలో త్రికోటేశ్వరస్వామి
నరసరావుపేట రూరల్: కార్తిక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున స్వామికి విశేష అభిషేకాలు ప్రత్యేక అలంకరణలు నిర్వహించిన అనంతరం భక్తులను స్వామిని దర్శించుకునేందుకు అనుమతించారు. ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి తుఫాన్ వల్ల చిరు జల్లులు కురు స్తున్నా భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయం వెనక భాగాన రావి చెట్టు వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
విశేషాలంకారంలో అమరేశ్వరుడు
అమరావతి: అమరావతి క్షేత్రంలోని బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయం కార్తిక సోమవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. వేకువనే భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ వేమూరి గోపీనాథశర్మ భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఉచిత అన్నదానం, ఉచిత ప్రసాదం అందజేశారు. పర్యాటకులతో మ్యూజియం, ధ్యానబుద్ధ ప్రాజెక్టు, సాయి మందిరం కూడా కళకళలాడాయి.

Comments
Please login to add a commentAdd a comment