‘వికసిత్‌ యాత్ర’ ప్రయోజనం చేకూర్చాలి | Sakshi
Sakshi News home page

‘వికసిత్‌ యాత్ర’ ప్రయోజనం చేకూర్చాలి

Published Sun, Dec 3 2023 1:40 AM

మాట్లాడుతున్న నోడల్‌ అధికారి రాహూల్‌, పక్కన కలెక్టర్‌ రంజిత్‌బాషా, జేసీ శ్రీధర్‌  
 - Sakshi

బాపట్ల అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతంలోని గిరిజనులకు చేరవేయాలని రాష్ట్ర నోడల్‌ అధికారి రాహుల్‌ మాలిక్‌ అన్నారు. వికసిత్‌ భారత సంకల్ప యాత్ర కార్యక్రమం అమలు తీరుపై శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, ఎంపీడీఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో యాత్ర కొనసాగుతున్న తీరుపై జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా, జిల్లా సంయుక్త కలెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌లు పీపీటీ ద్వారా ఆయనకు వివరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరాలని వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర జిల్లా నోడల్‌ అధికారి రాహుల్‌ మాలిక్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి పేదవాడికి చేర్చడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. గిరిజన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిరుపేదల జీవనోపాధి గత పరిస్థితుల కంటే మెరుగుపడాలన్నారు. సంకల్ప యాత్ర ద్వారా రానున్న మూడు నెలల్లో లబ్ధిదారుల సంఖ్య 20 శాతానికి పెరగడమే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత లబ్ధి చేకూరే పథకాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాహుల్‌ మాలిక్‌ చెప్పారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు. ప్రతి పథకంలో లక్ష్యాలు, పురోగతిని ప్రజలకు వివరించాలన్నారు. రానున్న మూడు నెలలలో ఏ మేరకు లబ్ధిదారుల సంఖ్య పెరిగిందో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు. వికసిత్‌ భారత సంకల్ప యాత్ర కార్యక్రమాలను జిల్లాలో 48 గ్రామపంచాయతీలలో నిర్వహించామని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా తెలిపారు. 459 పంచాయతీలలో నాలుగు ప్రచార వాహనాలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించామన్నారు. అన్ని గ్రామాలలో సజావుగా కార్యక్రమాలు సాగుతున్నాయన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్‌ సిహెచ్‌ శ్రీధర్‌, బాపట్ల ఆర్డీఓ జి.రవీందర్‌, జిల్లా పంచాయతీ అధికారి డి.రాంబాబు, అనుబంధ శాఖల అధికారులు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.

యాత్ర రాష్ట్ర నోడల్‌ అధికారి రాహుల్‌ మాలిక్‌

Advertisement
 
Advertisement
 
Advertisement