వారఫలాలు (సెప్టెంబర్‌ 27  నుంచి అక్టోబర్‌ 3 వరకు)

Weekly Horoscope From September 27th To October 3rd 2020 - Sakshi

వారఫలాలు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త  పనులు చేపట్టి అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. కొన్ని  వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు. పారిశ్రామికవర్గాలకు యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో బంధువులతో వివాదాలు. ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఎంతగా కష్టించినా ఫలితం అంతగా కనిపిం^è దు. ఆస్తుల వివాదాలు కొంత నిరాశ పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. స్వల్ప అనారోగ్య సూచనలు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలలో కొంత ప్రగతి సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. రాజకీయవేత్తల కృషి కొంత ఫలించే అవకాశం. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమాధిక్యం. ఎరుపు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మొదట్లో ఇబ్బంది పడినా క్రమేపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఇంటాబయటా పరపతి పెరుగుతుంది. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు  శుభవార్తలు.  ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. మిత్రులతో మరింత సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుని ఊరట చెందుతారు. ఉద్యోగవర్గాలకు కొత్త ఆశలు. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్యణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలోచనలు కొంత కలసివస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు క్రమేపీ సర్దుకుంటాయి. ఆస్తుల ఒప్పందాలలో వాయిదా పడతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. అనుకున్న కాంట్రాక్టులు దక్కే సూచనలు. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి.  వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  బాధ్యతలు పెరుగుతాయి. కళారంగం వారికి శ్రమ పడ్డా ఫలితం దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన కొన్ని పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆశించినంతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని రుణాలు సైతం తీరే అవకాశం. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాల విస్తరణ యత్నాలు సఫలమవుతాయి, లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అమితోత్సాహం, శుభవార్తలు. వారం చివరిలో అనారోగ్యం, దూరప్రయాణాలు. గులాబీ, నేరేడు రంగులు.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. ప్రముఖులతో ఊహించని పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కుటుంబంలో  శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో  అవాంతరాలు తొలగి పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో మరింత అనుకూలత. రాజకీయవర్గాలకు విశేష యోగదాయకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో సోదరులతో  వివాదాలు. అనారోగ్య సూచనలు. శ్రమ తప్పదు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది. రుణాలు కొంతమేర తీరతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.  ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరి ఒడ్డునపడతారు. ఉద్యోగలాభం.. సోదరులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు.  సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో ఆశించిన పోస్టులు సాధిస్తారు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి. కొన్ని ముఖ్య కాంట్రాక్టులు చేజారవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల వివాదాలు నెలకొని సమస్యగా మారవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో స్వల్ప అవాంతరాలు. కుటుంబసభ్యుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు పెరుగుతాయి.  వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. వారం మధ్యలో ధనప్రాప్తి. శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  నృసింహస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తీరతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. వాహనసౌఖ్యం. ఆస్తుల వ్యవహారాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు కార్యసిద్ధి. వారం చివరిలో ఆరోగ్యభంగం. సోదరులతో అకారణంగా విభేదాలు. ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఎంతటి వారినైనా అద్భుతమైన వాగ్ధాటితో ఆకట్టుకంటారు. కొన్ని వివాదాలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమై ఊరట చెందుతారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, పదవులపై కొత్త ఆశలు. వారం ప్రారంభంలో సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. నేరేడు, పసుపు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. అతిముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇతరుల సమస్యలు సైతం పరిష్కరించి ప్రశంసలు అందుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తొలగుతుంది. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top