సాక్షి, మదనపల్లె: అధికార పక్షం అడ్డంకులు, బెదిరింపులు, కిడ్నాప్ డ్రామాలను తట్టుకుని జిల్లాలోని నాలుగు మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) అధ్యక్ష పీఠాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. గురువారం ఆయా మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల్లో అధికారుల సమక్షంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నికలు జరిగాయి. తంబళ్లపల్లె, పెద్దమండ్యం, సదుం, నిమ్మనపల్లె మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు పూర్తి మెజారిటీతో హాజరై పీఠాలను దక్కించుకున్నారు. విజేతలంతా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టగా, ఆయా మండలాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.
నాలుగు మండలాల్లో విజేతలు వీరే..
సదుం (పుంగనూరు నియోజకవర్గం): మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ 8 స్థానాలను గెలుచుకుంది. ఇక్కడ బూరుగమంద ఎంపీటీసీ పెద్దిరెడ్డి ఇందిరమ్మ ఎంపీపీగా, అమ్మగారిపల్లి ఎంపీటీసీ వి. దేవేంద్ర వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.
తంబళ్లపల్లె: మొత్తం 11 ఎంపీటీసీలకు గాను 10 స్థానాలను వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకుంది. కన్నెమడుగు ఎంపీటీసీ దేవరింటి లీలావతి ఎంపీపీగా, ఎద్దులవారిపల్లె ఎంపీటీసీ ఎ.భూదేవి వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.
పెద్దమండ్యం: మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. కలిచర్ల ఎంపీటీసీ బి.పద్మావతి ఎంపీపీగా, వెలిగల్లు ఎంపీటీసీ ఎం.చాంద్ బాషా వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.
నిమ్మనపల్లె: మొత్తం 9 ఎంపీటీసీలకు గాను వైఎస్సార్‌సీపీ ఐదింటిని గెలుచుకుంది. ఇక్కడ వెంగంవారిపల్లి ఎంపీటీసీ ఆర్.లక్ష్మీదేవి ఎంపీపీగా, నిమ్మనపల్లె ఎంపీటీసీ ఎం.దావూద్ ఖాన్ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.
నిమ్మనపల్లెలో టీడీపీ ‘కిడ్నాప్’ డ్రామా విఫలం
మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లెలో కేవలం ఒక్క ఎంపీటీసీ తేడాతో ఓటమి తప్పదని గ్రహించిన టీడీపీ నేతలు ఎన్నిక సమయంలో హైడ్రామాకు తెరలేపారు. తమ పార్టీకి, జనసేనకు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు కిడ్నాప్‌కు గురయ్యారంటూ హల్‌చల్ సృష్టించి ఎన్నికను వాయిదా వేయించేందుకు కుట్ర పన్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో, రోడ్డుపై బైఠాయించి గగ్గోలు పెట్టారు. ఆ వెంటనే కొందరు టీడీపీ నేతలు ఎన్నికల హాల్లోకి చొరబడగా, అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులను బయటకు వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. టీడీపీ నేతలు బయటకు వెళితేనే తాము వెళతామని వైఎస్సార్‌సీపీ శ్రేణులు భీష్మించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు ఇరువర్గాలను బయటకు పంపడంతో ఎన్నిక సజావుగా జరిగి వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
రామసముద్రంలో కిడ్నాప్ కలకలం..
రామసముద్రం మండలంలో మొత్తం 14 ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ 7, టీడీపీ 6, జనసేన 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. అయితే, బుధవారం సాయంత్రం కమ్మవారిపల్లె వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ విజయకుమార్‌ను బెంగళూరులోని ఓ హోటల్ నుంచి టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. గురువారం ఎన్నిక సమయానికి ఆయన హాజరవుతారని భావించినప్పటికీ, చివరకు వైఎస్సార్‌సీపీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. దీంతో మిగిలిన ఏడుగురు సభ్యులతో (టీడీపీ 6, జనసేన 1) అధికారులు ఎన్నిక నిర్వహించగా, ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు టీడీపీ పరమయ్యాయి.
పీటీఎంలో తమ్ముళ్ల మధ్యే పోటీ..
పెద్దతిప్పసముద్రం (పీటీఎం) మండలంలోని 15 ఎంపీటీసీలకు టీడీపీ 8, వైఎస్సార్‌సీపీ 6, జనసేన 1 స్థానంలో గెలుపొందాయి. ఇక్కడ ఎంపీపీ పదవి కోసం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శంకర్ యాదవ్ వర్గానికే చెందిన మంజుల, లక్ష్మీదేవి పోటీపడ్డారు. ఎన్నికల హాల్ వద్దే కొందరు టీడీపీ నేతలు తిష్టవేసి సభ్యులను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఓటింగ్‌లో తొలుత లక్ష్మీదేవికి ఏడుగురు ఎంపీటీసీలు మద్దతుగా చేతులెత్తగా, ఆ తర్వాత మంజులకు ఎనిమిది మంది మద్దతు తెలపడంతో ఆమెను ఎంపీపీగా ప్రకటించారు.
ములకలచెరువు ఎన్నిక నేటికి వాయిదా..
టీడీపీ జిల్లా రాజకీయాల్లో ములకలచెరువు ఎంపీపీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలు ఉన్న ఈ మండలంలో టీడీపీకి ఏకంగా 11, జనసేనకు 1, వైఎస్సార్‌సీపీకి 1 స్థానం ఉన్నాయి. అయితే, టీడీపీ మండల అధ్యక్షుడు పాలగిరి సిద్ధా ఎంపీపీ పీఠాన్ని ఆశించగా, ఇన్‌ఛార్జ్ శంకర్ యాదవ్ మాత్రం కట్టా దొరస్వామి నాయు డు వైపు మొగ్గు చూపారు. దీంతో అసంతృప్తికి గురైన సిద్ధా, తనతో పాటు 8 మంది ఎంపీటీసీలను క్యాంపునకు తరలించారు. మూడు రోజుల క్రితం వీరు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించగా, ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారో ఆచూకీ లభించలేదు. విప్ జారీ చేసి ఎన్నిక నిర్వహించాలని శంకర్ వర్గం సిద్ధమైనప్పటికీ, సభ్యులు రాకపోవడంతో కోరం లేక అధికారులు ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. పాలగిరి సిద్ధా నేడైనా పట్టువిడుపులు ప్రదర్శిస్తారా లేదా అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
తంబళ్లపల్లె, పెద్దమండ్యం, సదుం, నిమ్మనపల్లె ఎంపీపీ, వైస్ ఎంపీపీ పీఠాలు వైఎస్సార్‌సీపీ కై వసం
నిమ్మనపల్లెలో టీడీపీ ‘కిడ్నాప్’ డ్రామా.. ఎన్నిక వాయిదాకు పచ్చ కుట్రలు విఫలం
రామసముద్రంలో వైఎస్సార్‌సీపీ సభ్యుల గైర్హాజరుతో టీడీపీకి దక్కిన పీఠం
పీటీఎంలో తమ్ముళ్ల మధ్యే పోటీ.. ములకలచెరువులో అజ్ఞాతం వీడని సిద్ధా వర్గంతో నేటికి ఎన్నిక వాయిదా!
నిమ్మనపల్లె మండల ఎంపీపీ ఎన్నికకు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. మెజార్టీ సభ్యులు ఉన్న వైఎస్‌ఆర్సీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు ఎన్నికలో పాల్గొన్నారు. మిథున్‌రెడ్డి సమక్షంలోనే ఎన్నిక నిర్వహించగా ఎంపీపీగా లక్ష్మీదేవి, వైస్ ఎంపీపీగా దావూద్ ఖాన్ లను ఎన్నుకున్నారు. ఎన్నికై న వారిని, ఎంపీటీసీలను మిథున్ రెడ్డి అభినందించారు. మండల అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని వారిని కోరారు.


